కోవిడ్ కారణంగా గడిచిన రెండేళ్లుగా అనేక ఆంక్షలను కట్టుదిట్టంగా అమలు చేసిన సింగపూర్ ఇప్పుడు వాటిని సడలించేందుకు అడుగులు వేస్తోంది.దీనిలో భాగంగా వలస కార్మికులకు శుభవార్త చెప్పింది.
తమ వసతి గృహాలను వదిలి బయటకు రావడానికి వారు ఇకపై ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని సింగపూర్ ప్రభుత్వం తెలిపింది.దాదాపు 3,00,000 మంది కార్మికులు ( వీరిలో అత్యధికులు దక్షిణాసియా దేశాల వారే) సింగపూర్‌లోని వసతి గృహాలలో వుంటూ పని చేసుకుంటున్నారు.
అయితే విస్తారమైన ఈ వసతి గృహ సముదాయాలు కోవిడ్ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.అంతేకాదు.
వైరస్ ఉద్ధృతంగా వున్న రోజులలో వీటి నుంచి ఏ ఒక్కరూ బయటకు రాకుండా లాక్ చేశారు అధికారులు.వీరంతా అత్యల్ప వేతనం పొందే పేద కార్మికులని ప్రజా సంఘాలు , మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
మరోవైపు.సింగపూర్‌లో ఇప్పుడిప్పుడే కేసులు అదుపులోకి వస్తుండటంతో ఆంక్షలను సడలిస్తోంది ప్రభుత్వం.నిజానికి అక్కడి పౌరులు బయటకు వచ్చేందుకు కఠినమైన నిబంధనలు కొద్దికాలం మాత్రమే అమల్లో వున్నాయి.అయితే వలస కార్మికులకు మాత్రం మినహాయింపు ఇవ్వలేదు.
ప్రత్యేక అనుమతి కింద పని ప్రదేశం, కార్యాలయాలకు వెళ్లేందుకు మాత్రమే అనుమతి వుండేది.విధులు ముగిసిన వెంటనే నేరుగా వసతి గృహాలకు తిరిగి వచ్చేయాల్సి వుంటుంది.
హద్దు మీరితే భారీ జరిమానాలు, జైలు శిక్ష విధించింది సింగపూర్.
అయితే అధికారులు వలస కార్మికులకు సంబంధించి క్రమక్రమంగా నిబంధనలను సడలించారు.దీనిలో భాగంగా ప్రత్యేకంగా నిర్మించిన వినోద కేంద్రాలను సందర్శించడానికి మొన్నామధ్య వీలు కల్పించారు.ఇవి కాకుండా నిర్దిష్ట ప్రాంతాలకు వెళ్లేందుకు గాను ఎగ్జిట్ పాస్‌లను తీసుకొచ్చారు.
అయితే ఈ శుక్రవారం నుంచి కార్మికులు వసతి గృహాలను విడిచిపెట్టి బయటకు వెళ్లేందుకు ఎలాంటి పాస్‌లు అక్కర్లేదని ప్రభుత్వం తెలిపింది. కానీ వారాంతాలు, ప్రభుత్వ సెలవు దినాల్లో మాత్రం దేశంలోని నాలుగు ప్రసిద్ధ ప్రదేశాలను సందర్శించడానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.