పెసర పంట సాగు( Green Gram crop )కు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే నేలలు చాలావరకు అనుకూలంగానే ఉంటాయి.రబీలో రెండవ పంటగా అధిక విస్తీర్ణంలో సాగు అయ్యే పంటలలో పెసర పంట కూడా ఒకటి.
పెసర పంటను పత్తి పంటలో అంతర పంటగా కూడా సాగు చేయవచ్చు.పెసరను ఖరీఫ్ లో సాగు చేయాలనుకుంటే జూన్ నెలలో విత్తుకోవాలి.
రబీలో సాగు చేయాలనుకుంటే అక్టోబర్ నెలలో విత్తుకోవాలి.వేసవికాలంలో సాగు చేయాలనుకుంటే ఫిబ్రవరి మార్చ్ నెలలలో విత్తుకోవాలి.
పెసర పంట సాగుకు చౌడు నేలలు, నీరు నిల్వ ఉండే నేలలు తప్ప అన్ని రకాల నేలలు అనుకూలంగానే ఉంటాయి.ఒక ఎకరాకు 8 కిలోల విత్తనాలు అవసరం.
ఒక కిలో విత్తనాలకు 30 గ్రాముల చొప్పున కార్పోసల్ఫాన్ తో విత్తన శుద్ధి( Seed treatment ) చేసుకోవాలి.ఇక మొక్కల మధ్య కనీసం 10 సెంటీమీటర్ల దూరం, మొక్కల వరుసల మధ్య కనీసం 30 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాలి.
పెసర పంటకు చీడపీడల బెడద కాస్త ఎక్కువ.చీడపీడల బెడద తక్కువగా ఉండాలంటే పొలంలో కలుపు సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.విత్తనం విత్తిన వెంటనే లేదంటే మరుసటి రోజు ఒక ఎకరాకు పెండిమిథాలిన్ 30% 1.8 లీటర్లు, ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.విత్తిన 20 రోజుల తర్వాత గొర్రుతో అంతర కృషి చేయాలి.కలుపు మొక్కలు విత్తనం దశకు రాకముందే పూర్తిగా నివారించాలి.
ఇక పెసర పంటకు తీవ్ర నష్టం కలిగించే చీడపీడల( Pests ) విషయానికి వస్తే చిత్తపురుగులు కీలకపాత్ర పోషిస్తాయి.పైరు రెండు ఆకుల దశలో ఉన్నప్పుడు ఈ పురుగులు ఆశించి ఆకులకు రంద్రాలు వేస్తాయి.వీటిని నివారించడం కాస్త ఆలస్యమైతే దాదాపుగా 100% పంటను నాశనం చేసేస్తాయి.ఈ పురుగులను గుర్తించిన వెంటనే ఒక ఎకరాకు 2.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.లేదంటే 2 మిల్లీలీటర్ల ఎండో సల్ఫాన్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.