ఏపీ రాజధాని వ్యవహారంలో చిక్కుముడులు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు.టిడిపి ప్రభుత్వ హయాంలో అమరావతిలో రాజధాని ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు, పెద్ద ఎత్తున భూములు సేకరించి తాత్కాలిక బిల్డింగులు నిర్మించారు.
అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేశారు.టిడిపి తర్వాత అధికారం చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతిని రాజధానిగా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేదని చెబుతూనే, మూడు రాజధానుల ప్రకటన చేసి హడావుడి చేసింది.
ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లడం, ఆ తర్వాత అసెంబ్లీలో మూడు రాజధానులు బిల్లుకు అనుకూలంగా తీర్మానం చేయడం, అక్కడి నుంచి తిరిగి తిరిగి ఇప్పుడు గవర్నర్ నిర్ణయం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చింది.ఇంత జరుగుతున్నా, ఈ విషయంలో కేంద్రం మౌనంగానే ఉంటూ వచ్చింది.
రాజధాని వ్యవహారం తమకు సంబంధం లేదని, పూర్తిగా అది రాష్ట్ర పరిధిలోని అంశమని, ఇందులో కేంద్రం జోక్యం ఏమీ లేదని చెప్పినా, ఇప్పుడు ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం మూడు రాజధానుల బిల్లు కు సంబంధించిన పూర్తి వివరాలు పంపించాలని కోరినట్లు తెలుస్తోంది.
ఇంత అకస్మాత్తుగా ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకోవడానికి కారణం హిందూ సంస్థలు, ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకుని అమరావతి కి మద్దతుగా నిర్ణయం తీసుకోవడం లేదని తెలుస్తోంది.ఇప్పటికే అమరావతిలో ఆలయం కడతామని హిందూ మహాసభ కూడా ప్రకటించింది.
హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శి ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేశారు.మూడు రాజధానుల నిర్ణయం చట్టవరుద్ధమని, అమరావతి రాజధానిగా ప్రకటించాలని హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శి లేఖలో పేర్కొనడంతో, ఆ మేరకు పీఎంవో ఆరా తీసినట్టు తెలుస్తోంది.ఇప్పటికే హిందూ మహాసభ రాజధాని వ్యవహారంపై ప్రధానమంత్రి కార్యాలయానికి అనేక ఫిర్యాదులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది.గవర్నర్ తో పాటు సుప్రీం కోర్టులోనూ రాజధాని వ్యవహారం పెండింగ్ లో ఉంది.
ఈ సమయంలో కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందనేది ఉత్కంఠగా మారింది.