సోషల్ మీడియా ఛాలెంజ్‌ల్లో కొన్ని అత్యంత ప్రమాదకరమైనవిగా ఉంటాయి.వాటిని ఎప్పుడూ ఎవరూ కూడా ట్రై చేయకూడదు.
అలాంటి వాటిలో “బాయిలింగ్ వాటర్ టు ఐస్”(Boiling Water to Ice) అనే ఒక ట్రెండ్ వైరల్ అయింది.ఈ ట్రెండ్‌లో మరుగుతున్న నీటిని గడ్డకట్టే చలిలో గాలిలోకి విసిరితే అది క్షణాల్లో ఐసు ముక్కలుగా మారుతుంది.
చూడటానికి కన్నుల పండుగలా ఉన్నా, ఇది ప్రాణాంతకం అని నిరూపితమవుతోంది.
డైలీ స్టార్ (Daily Star)కథనం ప్రకారం, ఈ ఛాలెంజ్‌ను ప్రయత్నించిన ఒక యువతి తీవ్రంగా గాయపడింది.
మంచు కురుస్తున్న వాతావరణంలో, ఆమె కెటిల్‌లోని వేడి నీటిని గాలిలోకి విసిరింది.కానీ ఊహించని విధంగా, నీరు వెనక్కి వచ్చి ఆమెపై పడటంతో సెకండ్-డిగ్రీ (Second-degree)కాలిన గాయాలయ్యాయి.
నొప్పితో విలవిలలాడుతూ ఆమె వెంటనే ఆసుపత్రి పాలైంది.ఈ ఘటనతో, ఇలాంటి ప్రమాదకరమైన ఛాలెంజ్‌ల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
“బాయిలింగ్ వాటర్ టు ఐస్” ఛాలెంజ్ చేసిన మహిళపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.“వెడల్పాటి కెటిల్ వాడటమే ఆమె చేసిన తప్పు.సన్నటి మూతి ఉన్న ఫ్లాస్క్ అయితే నీళ్లు వెనక్కి వచ్చేవి కావు,” అని ఒకరు కామెంట్ చేయగా, “ఇంత ప్రమాదకరమైన పని ఎవరైనా ఎందుకు చేస్తారు? ఇది శుద్ధ మూర్ఖత్వం,” అని మరొకరు దుయ్యబట్టారు.ఈ ఛాలెంజ్ ఎంత ప్రమాదకరమో చెప్పడానికి గతంలో జరిగిన సంఘటనలే సాక్ష్యం.
2019లో కెనడాలో భయంకరమైన చలిగాలులు వీచినప్పుడు, ఈ ఛాలెంజ్ చేసి చాలామంది తీవ్రంగా గాయపడ్డారు.చికాగోలోని లయోలా యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌కు చెందిన ప్రముఖ బర్న్ సర్జన్ డాక్టర్ ఆర్థర్ శాన్‌ఫోర్డ్ స్వయంగా ఆ సమయంలో కాలిన గాయాలతో బాధపడుతున్న ఏడుగురికి చికిత్స అందించారు.వారిలో ఒకరు కేవలం మూడేళ్ల పసివాడు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.పైకి సరదాగా కనిపించే ఈ ఛాలెంజ్ ప్రాణాలకే ప్రమాదమని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించకూడదని నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.