ఐబీఎం ఛైర్మన్, సీఈవోగా విధులు నిర్వర్తిస్తున్న భారత సంతతికి చెందిన అరవింద్ కృష్ణకు అమెరికాలో మరో ప్రతిష్టాత్మక పదవి దక్కింది.ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ డైరెక్టర్ల బోర్డుకు అరవింద్ ఎన్నికయ్యారు.
ఆయన క్లాస్ బి డైరెక్టర్‌గా ఎన్నికైనట్లుగా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ సోమవారం ప్రకటించింది.
ప్రస్తుతం క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చెయిన్, క్వాంటం కంప్యూటింగ్‌లో ఐబీఎం కోసం కొత్త మార్కెట్‌ల నిర్మాణానికి, విస్తరణకు అరవింద్ కృష్ణ నాయకత్వం వహిస్తున్నారు.
ఈ అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై ఆధారపడిన వినూత్న ఐబీఎం ఉత్పత్తులు, పరిష్కారాల అభివృద్ధిలో కూడా ఆయన కీలకపాత్ర పోషించారని న్యూయార్క్ ఫెడ్ ప్రశంసించింది.
అమెరికా ఆర్ధిక వ్యవస్థల భద్రత, పటిష్టత, చైతన్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలతో కలిసి ఫెరడల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ పనిచేస్తుంది.
ఇది 12 ప్రాంతీయ రిజర్వ్ బ్యాంకులలో ఒకటి.ఇక యూఎస్ ఫెడ్ విషయానికి వస్తే.
ఇది అమెరికా కేంద్ర బ్యాంక్‌గా వ్యవహరిస్తుంది.దీనిని 1913లో యూఎస్ కాంగ్రెస్ చట్టం చేత ఏర్పాటు చేశారు.
దీని ప్రకారం.ప్రతి రిజర్వ్ బ్యాంక్ కూడా డైరెక్టర్ల బోర్డు పర్యవేక్షణలో పనిచేయాలి.
ప్రతి రిజర్వ్ బ్యాంక్‌లో తొమ్మిది మంది డైరెక్టర్లు తమ రిజర్వ్ జిల్లా ప్రయోజనాలకు ప్రాతినిథ్యం వహిస్తారు.
కాగా.ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన కృష్ణ ఐఐటీ కాన్పూర్‌లో అండర్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు.అనంతరం యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పీహెచ్‌డీ పట్టా పొందారు.15 పేటెంట్లకు రచయితగా ఉన్న అరవింద్ కృష్ణ, 1990లో ఐబీఎంలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు.కంపెనీ జనరల్ మేనేజర్‌గా, ఐబీఎం సాఫ్ట్‌వేర్ స్ట్రాటజీ వైస్ ప్రెసిడెంట్‌గా, ఐబీఎం రీసెర్చ్‌లోనూ కీలకమైన పలు టెక్నికల్ బాధ్యతలు నిర్వర్తించారు.
ఈ నేపథ్యంలో 2020 ఫిబ్రవరి నెలలో ఆయనను ఐబీఎం సీఈవో, డైరెక్టర్ల బోర్డు సభ్యుడిగా ఎంపిక చేశారు.కాగా అంతర్జాతీయ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న తెలుగువాళ్లలో అరవింద్ కృష్ణ నాలుగో వ్యక్తి.