అత్యాశకు పోతే ఉన్నది పోవడంతో పాటు అప్పుల పాలవుతారని పెద్దలు చెప్తుంటారు.అయినా వినిపించుకోకుండా కొందరూ కోరి మరీ కష్టాలు తెచ్చుకుంటారు.
ఇన్సూరెన్స్ కోసం కక్కుర్తి పడుతుంటారు.అలాంటి వ్యక్తులను మనం సొసైటీలో చాలా మందిని చూడొచ్చు.
ఆ కోవకు చెందిన వ్యక్తే మనం తెలుసుకోబోయే అతడు.ఇన్సూరెన్స్ కోసం ఆశపడి సొంత బెంజ్ కారునే తగులబెట్టాడు.
దాంతో కేసులపాలయ్యాడు.ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.
గుంటూరు జిల్లాలోని రెంటచింతలకు చెందిన చింతా రవీంద్రరెడ్డి అయ్యప్ప ట్రేడర్స్ పేరిట పురుగుల మందు షాపు నిర్వహిస్తున్నాడు.ఈ క్రమంలో ఏడాది కిందట సెకండ్ హ్యాండ్‌లో బెంజ్ కారు కొన్నాడు.
సదరు కారును ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కు ఇస్తూ ఉంటాడు రవీంద్రరెడ్డి.ఇటీవల తన ఫ్రెండ్‌కు కారు ఇవ్వగా అతడు కారు కీ పోగొట్టాడు.
డూప్లికేట్ కీ కోసం ఎంత ప్రయత్నించినా లభించలేదు.దాంతో కారును తగలబెడితే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని ఫ్రెండ్స్ సలహా ఇచ్చారు.
దాంతో డబ్బులపై ఆశతో కక్కుర్తి పడి కారు తగులబెట్టేందుకు ప్లాన్ చేశాడు.ఈ నెల 17న ఇద్దరు ఫ్రెండ్స్ వెంకటేశ్వర్లు, నాగరాజు సాయంతో తక్కెళ్లపాడు ఫ్లై ఓవర్ బ్రిడ్జి దాటాక సర్వీస్ రోడ్డు పక్కన బెంజ్ కారును పార్క్ చేశారు.
ఆరోజు రాత్రి రెయిన్ వల్ల కారు తగులపెట్టకుండా వెళ్లిపోయారు.మరుసటి రోజు అనగా 18న రాత్రి 9 గంటలకు పెట్రోల్ తీసుకొచ్చి అర్ధరాత్రి 12 గంటల సమయంలో పెట్రోల్ పోసి కారును తగలబెట్టి పారిపోయారు.
ఈ సమయంలో నాగరాజు చేతులు, ముఖానికి గాయాలయ్యాయి.అయితే, అప్పటికే కారు తగులబడుతుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
సీఐ సురేష్ బాబు తన సిబ్బందితో అక్కడికి వెళ్లారు.అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.కారును ఎవరో తగులబెట్టారన్న అనుమానంతో పరిసరాలు పరిశీలించగా వారికి పెట్రోలు ఉన్న బాటిల్ కనిపించింది.దాంతో విచారణ ప్రారంభించి కేవలం ఇన్సూరెన్స్ కోసమే కారు ఓనర్ ఇలా చేసి ఉండొచ్చని అనుమానించారు.
ఫైనల్‌గా కేసును రెండు రోజుల్లోనే ఛేదించారు.కారును పబ్లిక్ ప్లేస్ లో తగులబెట్టడం వల్ల ప్రజలకు హాని కలుగుతుందన్న నేరంపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.
చింతా రవీంద్రరెడ్డి, అతడి స్నేహితులు వెంకటేశ్వర్లు, నాగరాజును అరెస్టు చేశారు.