కరోనా కారణంగా ఒకప్పుడు ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని పలకరించుకునే వారి మధ్య దూరం పెరిగిపోయింది.కరచాలనం ఇచ్చి హాయ్ అని చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు.
ఇక పెళ్లి వేడుక అంటే వేల సంఖ్యలో తరలివచ్చే బంధుగణం మధ్యలో వైభవంగా పెళ్లి వేడుకతో కొత్తజంట ఒకటవుతుంది.అయితే కరోనా పుణ్యమా అని పెళ్లి వేడుకలో కూడా బంధువులు లేకుండా అయిపోతున్నారు.
వచ్చిన బంధువులు కూడా సామాజిక దూరం పాటించాలని చెప్పడంతో వారు సరదాగా వేడుకలో పాల్గొనలేని పరిస్థితి.అయితే మేనల్లుని వివాహ ఊరేగింపులో లాక్డౌన్ నిబంధనల పేరుతో తనను రానివ్వనందున కలత చెందిన మామ తన చెయ్యి కోసుకున్నాడు.
ఈ ఘటన యూపీలోని మీర్జాపూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
అహ్రౌరాడీహ్కు చెందిన వరుడు ఓంప్రకాష్ ఊరేగింపుగా చందౌలి జిల్లాకు బయలుదేరాడు.
అయితే లాక్డౌన్ నియమాలు, సామాజిక దూరం పాటించాల్సిన కారణంగా ఊరేగింపులో ఐదుగురు మాత్రమే పాల్గొనాలని నిర్ణయించుకున్నారు.ఇంతలో వరుని మామ తానూ వస్తానంటూ పట్టుబట్టాడు.దీంతో పెళ్లి పెద్దలు ఎంత నచ్చచెప్పినా అతను వినలేదు.పైగా వారంతా తనను దూరంపెడుతున్నారని భావించి, పదునైన కత్తితో చెయ్యి కోసుకున్నాడు.
దీనిని గమనించిన అక్కడున్నవారు బాధితుడిని వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు.
పెళ్లి వేడుకలో సామాజిక దూరం కారణంగా ఇప్పుడు ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.