పసిఫిక్ మహాసముద్రం అడుగు భాగంలో శాస్త్రవేత్తలు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని కనుగొన్నారు.సాధారణంగా సముద్రం అడుగు కింద భూమి పొర ఉంటుంది.
ఆ భూపొరలో భారీ పరిమాణంలో ఉన్న జీవులు నివసిస్తున్నాయని వారు కనుగొన్నారు! సముద్రాల్లో అనేక విచిత్రమైన జీవులు ఉన్నప్పటికీ, ఈ కొత్త ఆవిష్కరణ సముద్ర జీవశాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరిచింది.
ష్మిత్ ఓషన్ ఇనిస్టిట్యూట్‌కు(Schmidt Ocean Institute) చెందిన పరిశోధకులు, సముద్ర ఉపరితలం నుంచి 2500 మీటర్ల కంటే ఎక్కువ లోతులో ఉన్న ప్రాంతాలను అధ్యయనం చేయడానికి అత్యాధునిక సబ్‌మెర్సిబుల్(Submersible) పరికరాలను ఉపయోగించారు.
అక్కడ వారు భూమి లోపల ఉన్న గుహల్లో మూడు మీటర్ల వరకు పెరిగే భారీ పరిమాణంలో ఉన్న పురుగులను కనుగొన్నారు.ఈ భారీ ట్యూబ్‌వార్మ్‌లను ‘రిఫ్టియా పాచిపిటిలా’(Riftia pachypitila’) అని పిలుస్తారు.
ఇంతకు ముందు ఈ జీవులు సముద్రపు అడుగు భాగంలోని హైడ్రోథర్మల్ వెంట్స్ చుట్టూ మాత్రమే నివసిస్తాయని శాస్త్రవేత్తలు భావించేవారు.కానీ ఇప్పుడు భూమి లోపల కూడా ఇవి నివసిస్తున్నాయని తేలింది.
పసిఫిక్ మహాసముద్రం(Pacific Ocean) అడుగు భాగంలోని భూమి లోపల భారీ పరిమాణంలో ఉన్న పురుగులు మనుగడ సాగించడానికి అనువైన పరిస్థితుల్లో జీవిస్తున్నాయని శాస్త్రవేత్తలు(Scientists) కనుగొన్నారు.ఈ పురుగులు నివసిస్తున్న ప్రదేశం చాలా వేడిగా ఉంటుంది, ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది, సల్ఫర్-రిచ్ హైడ్రోథర్మల్ లిక్విడ్ అధికంగా ఉంటుంది.ఇంత కష్టమైన పరిస్థితుల్లో ఇంత పెద్ద పరిమాణంలో పెరగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఈ భారీ ట్యూబ్‌వార్మ్‌లతో పాటు, పరాలవినెల్లా అనే మరొక రకమైన పురుగులు, అనేక రకాల గ్యాస్ట్రోపాడ్‌లు కూడా అక్కడ కనిపించాయి.ఈ పరిశోధన ద్వారా సముద్రపు అడుగు భాగం, భూమి లోపల ఉన్న జీవవైవిధ్యం ఒకదానితో ఒకటి ఎంతగా అనుసంధానమై ఉన్నాయో తెలుస్తుంది.పురుగుల పిల్లలు, ఇతర చిన్న జీవులు హైడ్రోథర్మల్ వెంట్స్ ద్వారా ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రయాణిస్తాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.
ఈ విషయాన్ని నిరూపించడానికి, శాస్త్రవేత్తలు లావా షెల్ఫ్‌లను ఎత్తి చూసినప్పుడు, భారీ ట్యూబ్‌వార్మ్‌లు, ఇతర జీవులు గుహల్లో దాక్కుని ఉన్నట్లు కనుగొన్నారు.దీని ద్వారా సముద్రపు అడుగు భాగం, భూమి లోపల ఉన్న జీవవైవిధ్యం ఒకే వ్యవస్థలో భాగమని స్పష్టమవుతోంది.
ఈ ఆవిష్కరణ సముద్రపు అడుగు జీవితం ఎంత రహస్యమైనదో మరోసారి నిరూపిస్తోంది.