మే 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా కార్మికుల దినోత్సవం ఎంతో ఘనంగా జరుగుతుంది.కార్మికుల హక్కులు , వారి ఆత్మ గౌరవానికి ప్రతీకగా మే డే ను ఎంతో గౌరవంగా జరుపుకుంటారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతీ ఒక్క కార్మికుడు గర్వపడేలా మే డే ను సెలవు దినంగా ప్రకటించారు.ఈ రోజును కార్మిక సంఘాలు అన్నీ అతిపెద్ద పండుగలా జరుపుకుంటాయి.
అయితే ఎంతో మంది భారత్ నుంచీ విదేశాలకు ఉద్యోగాల నిమిత్తం కార్మికులుగా ప్రతీ ఏటా వెళ్తూ ఉంటారు.ముఖ్యంగా యూఏఈ , సింగపూర్ వంటి దేశాలకు భారత్ నుంచీ వలసలు వెళ్ళే కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
అందులోనూ తెలుగు రాష్ట్రాల నుంచీ వెళ్ళే వారే అత్యధికం.
చదువు పెద్దగా లేకపోయినా రెక్కల కష్టం మీద ఆధారపడి దేశం కాని దేశంలో కార్మికుడిగా జీవనం సాగిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు.
అలాంటి వారికి ఎలాంటి కష్టం వచ్చినా మేమున్నామంటూ స్థానికంగా ఎన్నో తెలుగు సంఘాలు తోడుగా ఉంటున్నాయి.కార్మికుల దినోత్సవంను పురస్కరించుకుని సింగపూర్ లో ఉన్న తెలుగు సమాజం తెలుగు రాష్ట్రాల నుంచీ వచ్చి కార్మికులుగా పనిచేస్తున్న సుమారు 1200 మందికి సాయం అందించి మేడే శుభాకాంక్షలు తెలిపింది.
సింగపూర్ వ్యాప్తంగా ఎంతో మంది తెలుగు కార్మికులు ఉన్నారని వారందరికీ మేడే శుభాకాంక్షలు తెలుపుతున్నామని తెలుగు సమాజం ప్రతినిధులు తెలిపారు.ప్రత్యేక ఆహార పదార్ధాలు తయారు చేయించిన బాక్స్ లను తెలుగు కార్మికులకు ఇస్తూ వారికి ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.కరోనా సమయంలో తెలుగు వారికి అండగా ఉంటూ వారికి సహాయసహకారాలు అందించామని అయితే ఎంతో కాలం తరువాత నేరుగా వారి వద్దకు వెళ్లి కలుసుకోవడం సంతోషాన్ని ఇస్తోందని సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి తెలిపారు.తెలుగు వారికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తనతో పాటు సంస్థ సభ్యులు అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు.