కాంగ్రెస్ నేత, ప్రముఖ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య పంజాబ్‌తో పాటు యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది.ఆదివారం తన అనుచరులు, మిత్రులతో కలిసి మాన్సా జిల్లాలోని స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో మూసేవాలాపై గుర్తుతెలియని వ్యక్తులు అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వం వీఐపీలకు సెక్యూరిటీని ఉపసంహరించి 24 గంటలు తిరక్కుండానే మూసేవాలా హత్య జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ నేపథ్యంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందించారు.
మూసేవాలా హత్య వెనుక వున్న వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఈ క్రమంలో మూసేవాలా హత్య వెనుక కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ ప్రమేయం వుందని పంజాబ్ డీజీపీ వీకే భవ్రా తెలిపారు.లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన గోల్డీ బ్రార్ ఈ హత్యకు బాధ్యత వహించినట్లు ఆయన వెల్లడించారు.
అలాగే విద్యార్ధి నాయకుడు, యూత్ అకాలీదళ్ సభ్యుడు విక్కీ మిద్దుఖేరా హత్యతో ఈ ఘటనకు సంబంధం వుందని డీజీపీ పేర్కొన్నారు.మిద్దుఖేరా హత్య కేసు అనుమానితుల్లో మూసేవాలా మాజీ మేనేజర్ షగన్ ప్రీత్ సింగ్ ఒకరని.
నలుగురు దుండగులు ఆయన ఇంట్లో మకాం వేసినట్లు ఆరోపణలు వచ్చినట్లు డీజీపీ చెప్పారు.షగన్‌ప్రీత్‌ను పోలీసులు ప్రశ్నించారని.అయితే ఈ కేసులో అతనిని అరెస్ట్ చేయలేదని, అనంతరం ఆస్ట్రేలియాకు పారిపోయాడని డీజీపీ వెల్లడించారు.
మరోవైపు తన స్నేహితులైన మిద్ధుఖేరా, గుర్లాలా బ్రార్‌ల హత్యల్లో మూసేవాలా ప్రమేయం వుందని గోల్డీ తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నాడు.సిద్ధూ హత్యకు సంబంధించి వేర్వేరు తుపాకుల నుంచి మొత్తంగా 30 బుల్లెట్లు పేలినట్లు డీజీపీ చెప్పారు.ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు భటిండా ఐజీ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్లు భవ్రా వెల్లడించారు.
సిట్ సభ్యుల్లో మాన్సా ఎస్పీ (ఇన్వెస్టిగేషన్) ధరమ్ వీర్ సింగ్, భటిండా డీఎస్పీ (ఇన్వెస్టిగేషన్) విశ్వజీత్ సింగ్, మాన్సా సీఐఏ ఇంఛార్జ్ ప్రీతిపాల్ సింగ్ వున్నారు.
తన మిత్రులు గుర్వీందర్ సింగ్, గురుప్రీత్ సింగ్‌లతో కలిసి మూసేవాలా ఆదివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో తన ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు డీజీపీ తెలిపారు.దాడి జరిగిన సమయంలో సిద్ధూ తన మహీంద్రా థార్‌ను స్వయంగా నడుపుతున్నారు.
వీరి వాహనం జవహర్ కే గ్రామానికి చేరుకోగానే మూడు కార్లు వెంబడించాయి.అనంతరం కొద్దిదూరం వెళ్లాక మూసేవాలా కారును దుండగులు అడ్డగించి కాల్పులు జరిపినట్లు వీకే భవ్రా తెలిపారు.