భారతదేశంలో వివాహ వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారన్న సంగతి తెలిసిందే.దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలాగా వివాహాలు జరుగుతాయి.
ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లినా మూలాలు మరిచిపోని భారతీయులు పెళ్లిళ్ల విషయంలోనూ సాంప్రదాయాన్ని ఫాలో అవుతూనే వున్నారు.ఇకపోతే.
పంజాబీల వివాహా వేడుకలు ఫుల్ జోష్‌తో జరుగుతాయన్న సంగతి తెలిసిందే.ఇక పెళ్లిళ్లలో డ్యాన్స్ విషయంలో పంజాబీలు ఓ మెట్టు పైనే వుంటారు.
బంధుమిత్రులనే కాదు… తమకు ఏ మాత్రం పరిచయం లేని వారిని కూడా వేడుకల్లోకి లాగేస్తూ వుంటారు.అందుకు ఈ ఘటనే ఉదాహరణ.
అమెరికాలో జరిగిన ఓ పంజాబీ పెళ్లి వేడుకలో పరిమితికి మించి శబ్ధాలు వస్తున్నట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.ఈ సందర్భంగా పెళ్లికి వచ్చిన అతిథులతో కలిసి వారు పంజాబీ పాటకు గ్రూప్ స్టెప్స్ వేశారు .ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే.
వేడుకలో డ్యాన్స్, మ్యూజిక్ హోరు శృతిమించినట్లు స్థానికుల నుంచి ఫిర్యాదు అందడంతో కాలిఫోర్నియాకు చెందిన పోలీసు అధికారులు పెళ్లి జరుగుతున్న వేదిక వద్దకు చేరుకున్నారు.శుభమా అని పెళ్లి జరుగుతుంటే ఈ పోలీసులు వచ్చారేంట్రా బాబు అని కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు.
అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ.సదరు పోలీసు అధికారులు అతిథులతో కలిసి డ్యాన్స్ చేయడం ప్రారంభించారు.
ఇందుకు సంబంధించిన వీడియోను ‘కందా ప్రొడక్షన్స్’ అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాలో షేర్ చేశారు.దీనిపై మన్‌ప్రీత్ అనే వ్యక్తి స్థానిక న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ.పెళ్లి వేడుక వద్దకు పోలీసులు రావడం చూసి తాము భయపడ్డామని , వేడుకల్ని నిలిపివేయాలని చెబుతారేమోనని భావించామని పేర్కొన్నాడు.తాము వారితో మాట్లాడామని.వారు చాలా కూల్‌గా వున్నారని, ఆ వెంటనే డ్యాన్స్ చేయమని చెబుతూ రెండు మూవ్‌మెంట్స్ నేర్పించానని మన్‌ప్రీత్ తెలిపాడు.తర్వాత అతను చెప్పిన విధంగా పంజాబ్ పాటకు డ్యాన్స్ చేశారు అమెరికా పోలీసులు.
ఈ ఘటనపై శాన్ జోక్విన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం ఓ ట్వీట్ చేసింది.పెళ్లిలో పోలీస్ సిబ్బందికి అద్భుతమైన ఆతిథ్యం అందించిన వారికి ధన్యవాదాలు తెలియజేసింది.
అలాగే మితిమీరిన సంగీతంపై ఫిర్యాదు చేసిన స్థానికులకు కూడా కృతజ్ఞతలు తెలిపింది.