అగ్ర రాజ్యం అమెరికాలో చదువుకుని అక్కడే మంచి ఉద్యోగం సాధించి ఆర్ధికంగా మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని ఎంతో మంది భారతీయ విద్యార్ధులు కలలు కంటుంటారు.అందుకు తగ్గట్టుగానే అమెరికా వెళ్ళిన మన విద్యార్ధులు చదువు పూర్తయిన తరువాత ఉన్నత ఉద్యోగాలలో కొలువుదీరుతుంటారు.
అయితే అమెరికా విధించిన పరిమిత విద్యార్ధి వీసాల కారణంగా ప్రతీ ఏటా భారత్ నుంచీ అమెరికా వెళ్ళాలనుకునే విద్యార్ధులలో కొంత మందికి మాత్రమే అమెరికా వెళ్ళే అవకాశం దక్కుతోంది.ఈ పరిమిత వీసాల సంఖ్య పెంపుపై అమెరికన్ ఎంబసీ తాజాగా కీలక ప్రకటన చేసింది.
2021 లో ఇచ్చిన విద్యార్ధి వీసాల కంటే కూడా అంతకు మించి 2022 లో అత్యధికంగా విద్యార్ధి వీసాలను అందించాలని డిసైడ్ అయ్యిందట.ఈ మేరకు ఢిల్లీ లోని అమెరికా ఎంబసీ అధికారిణి పాట్రిసియా లసినా కీలక ప్రకటన చేసారు.2021 లో సుమారు 62 వేల విద్యార్ధి వీసాలను అందించామని ఈ సారి అంతకు మించి 2022 లో లక్ష విద్యార్ధి వీసాలను అందించే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలిపారు.
అమెరికాలో వివిధ వర్సిటీలలో ప్రవేశాల కోసం ఏకంగా లక్షకు పైగా దరఖాస్తులను పరిశీలిస్తున్నట్టుగా ఆమె ప్రకటించారు.
ఎంబసీలో నిన్నటి రోజున నిర్వహించిన స్టూడెంట్ వీసా డే లో భాగంగా ఆమె ఈ ప్రకటన చేసారు.అంతేకాదు ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు ఈ సందర్భంగా చేశారు.
భారతీయ విద్యార్ధులను ఆకర్షించే క్రమంలో వారు అమెరికా రావాలనుకునే ఆసక్తిని పరిశీలించే విషయంలో అమెరికా ఆలస్యం చేసిందని ఫలితంగా ఈ అవకాశాన్ని మిగిలిన దేశాలు ఉపయోగించుకున్నాయని, అందుకే అమెరికా స్టూడెంట్ వీసాను భారతీయ విద్యార్ధుల కోసం సరళమైన పద్దతిలో తీసుకువచ్చామని ఆమె తెలిపారు.అమెరికాలో విదేశీ విద్యార్ధుల సంఖ్యలో భారత్ రెండవ స్థానంలో ఉందని, సుమారు 2 లక్షల మంది భారతీయ విద్యార్ధులు అమెరికాలో వివిధ విద్యాసంస్థలలో చదువుకుంటున్నారని ఆమె ప్రకటించారు.