ప్రస్తుత రోజుల్లో మనుషులు మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్నారు.దీనిపై అనేక మంది కవులు సందేశాలు వెలువరించారు.
అలాంటి సందేశాలు చదివిన తర్వాతైనా మానవులు ఏమాత్రం మారకుండా అలాగే వ్యవహరిస్తున్నారు.తోటి వారు ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నా కూడా కనీసం కనికరం చూపించడం లేదు.
రోడ్లపై నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారు.వారిలో కొంత మంది ప్రమాదాల భారిన పడుతుంటారు.
ఆ ప్రమాదాల్లో చిక్కుకున్న కొందరు వ్యక్తులను సకాలంలో స్పందించి ఆస్పత్రులకు తీసుకెళ్తే వారి ప్రాణాలు నిలుస్తాయి.కానీ మనలో చాలా మంది మానవత్వం మరిచి జీవిస్తున్నారు.
పోలీసు కేసులకు భయపడో, లేదా మరే కారణాల వల్లో తమకు ఎందుకులే ఇదంతా అని అక్కడి నుంచి జారుకుంటున్నారు.అలా చేయడం వల్ల ఓ వ్యక్తి అన్యాయంగా తన ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది.
ఇక సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల విషయానికి వస్తే మనలో అవేర్నెస్ కోసం ట్రాఫిక్ పోలీసులు చాలా కష్టాలు పడుతుంటారు.సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ… అనేక రకాలుగా అవగాహన కల్పిస్తుంటారు.
అయినా కానీ నిత్యం వేలల్లో వాహనదారులు ఉల్లంఘనలకు పాల్పడడం విచారకరం.రీసెంట్ గా సైబరాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోను చూస్తే మాత్రం అసలు ఈ లోకంలో మానవత్వమే లేదా అన్న అనుమానం కలుగకమానదు.
హైదరాబాద్ శివార్లలోని తుర్కపల్లి, శామీర్ పేట్ రహదారిపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడు ప్రమాదంలో గాయపడతాడు.రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అతడిని చూసేందుకు జనాలు పోగైనా కూడా ఎవరూ కనీసం అంబులెన్స్ కు కూడా కాల్ చేయరు.ఇలా ఉన్న అతడిమీది నుంచి ఓ వ్యక్తి కారుతో దూసుకెళ్లడం మూలాన అతడు తన ప్రాణాలు కోల్పోతాడు.ప్రస్తుతం ఇది చూసిన నెటిజన్లు అయ్యో అని అనుకుంటూ బాధపడుతున్నారు.
ఎవరైనా అంబులెన్స్ కి ఫోన్ చేసినా, లేదా తనను రోడ్డు మీద నుంచి పక్కకు జరిపినా బతికేవాడని కామెంట్లు పెడుతున్నారు.