బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్( Rishi Sunak ) సారథ్యంలోని కన్జర్వేటివ్ పార్టీ( Conservative Party ) దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే.దాదాపు 14 ఏళ్లుగా అధికారం కోసం పోరాడుతున్న లేబర్ పార్టీ( Labour Party ) ఎట్టకేలకు విజయం వరించింది.
ఫలితాల అనంతరం తన సొంత నియోజకవర్గం రిచ్మండ్ అండ్ నార్తర్న్ అలర్టన్‌లో ఓటమిపై రిషి సునాక్ మాట్లాడారు.ఈ పరాజయానికి పూర్తి బాధ్యత తనేదనని ఆయన స్పష్టం చేశారు.
తనను క్షమించాలని పార్టీ మద్ధతుదారులను రిషి సునాక్ కోరారు.ఎన్నికల్లో విజయం సాధించిన లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్‌కు( Keir Starmer ) ఆయన అభినందనలు తెలియజేశారు.
అధికారం శాంతియుతంగా చేతులు మారుతుందని చెబుతూ రిషి భావోద్వేగానికి గురయ్యారు.
కాగా.ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్‌లలోని 650 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి.అధికారాన్ని అందుకోవడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 326.ఇప్పటి వరకు అందుతున్న లెక్కలను బట్టి లేబర్ పార్టీ 400 పైనే స్థానాల్లో విజయం సాధించినట్లుగా తెలుస్తోంది.కన్జర్వేటివ్ పార్టీ 120 స్థానాల్లో, లిబరల్ డెమొక్రాట్లు 71 స్థానాల్లో విజయం సాధించినట్లుగా వార్తలు వస్తున్నాయి.14 ఏళ్ల పాలనా కాలంలో కన్జర్వేటివ్‌లు పలు దఫాలు ప్రధానులను మార్చారు.బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్ వంటి నేతలపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి.
అలాగే ఆర్ధిక మాంద్యం, ద్రవ్యోల్భణంతో పాటు వలసల నియంత్రణపై సునాక్ తీసుకున్న కఠిన చర్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.సొంత పార్టీ నేతలే రిషిపై విమర్శలు గుప్పించారు.ఈ వైఫల్యాలను లేబర్ పార్టీ తనకు అనుకూలంగా మలచుకుని ప్రచారంలో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి విజయం సాధించింది.
గురువారం ఉదయం 7 గంటలకు యూకే సార్వత్రిక ఎన్నికల పోలింగ్( UK Elections ) ప్రారంభమై.రాత్రి 10 గంటల వరకు కొనసాగింది.దేశంలో దాదాపు 4.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నా.మందకొడిగా పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది.2019తో పోలిస్తే తక్కువ ఓటింగ్ నమోదైనట్లుగా అధికారులు అంచనా వేవారు.పోలింగ్ కోసం దేశవ్యాప్తంగా 40 వేల బూత్‌లను ఏర్పాటు చేశారు.
నార్త్ ఇంగ్లాండ్‌లోని రిచ్మండ్లో తన సతీమణి అక్షతా మూర్తితో( Akshata Murty ) కలిసి రిషి సునాక్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.పోలింగ్‌కు ముందు నుంచే ఈసారి కన్జర్వేటివ్ పార్టీకి భంగపాటు తప్పదని పలు సర్వేలు అంచనా వేశాయి.
ఇప్పుడు విశ్లేషకులు ఊహించినట్లుగానే ఫలితాలు వస్తున్నాయి.