యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమాదేవిపై సోమవారం నిర్వహించనున్న అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందా? వీగుతుందా అనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతుంది.మండల పరిధిలో 13 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 11 మంది ఎంపీటీసీలు రాతపూర్వకంగా గత సంవత్సరం చౌటుప్పల్ ఆర్డీవోకు ఎంపీపీపై అవిశ్వాసానికి ఫిర్యాదు చేశారు.
అప్పట్లో ఎంపీపీ గుత్తా ఉమాదేవి కోర్టును ఆశ్ర యించగా స్టే విధించడంతో అవిశ్వాసం ఆగిపోయింది.సొంత పార్టీకి చెందిన బీఆర్ఎస్ ఎంపీపీపైనే అవిశ్వాసానికి ఫిర్యాదు చేయడం వెనుక పార్టీ ఇంచార్జ్,మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రోత్బలం ఉందని ఎంపీపీ ఆరోపించారు.
ఎంపీపీ,మాజీ ఎమ్మెల్యే మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీపీగా ఎన్నికైన గుత్తా ఉమాదేవి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.అవిశ్వాసంపై ఉమాదేవి తెచ్చుకున్న స్టే ఎత్తివేయడంతో చౌటుప్పల్ ఆర్డిఓ శేఖర్ రెడ్డి అవిశ్వాసానికి నోటీసులు జారీ చేశారు.
దీంతో ఏప్రిల్ 1న అధికారులు అవిశ్వాసానికి ఏర్పాట్లు చేశారు.మొత్తం 13 ఎంపీటీసీ స్థానాలలో బీఆర్ఎస్ 9,సిపిఎం 2, సిపిఐ,కాంగ్రెస్ చెరొక స్థానాల్లో గెలువగా బీఆర్ఎస్ నుండి ఎంపీపీగా ఎన్నికైన గుత్త ఉమాదేవి ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరగా కాంగ్రెస్ నుండి గెలుపొందిన రాచకొండ ఎంపీటీసీ శివరాత్రి కవిత బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
అదే విధంగా అవిశ్వాసంలో సిపిఎం తటస్థ వైఖరి అవలంబిస్తుందని అధిష్టానం ప్రకటించగా సిపిఎంకు చెందిన ఎంపీటీసీ దోడ వినోద్ రెడ్డి ఇటీవలే మృతి చెందారు.ప్రస్తుతం 12 మంది ఎంపీటీసీలకు గాను కోరం సభ్యులు హాజరైతేనే అవిశ్వాసాన్ని నిర్వహిస్తారు.
ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలు క్యాంపులకు వెళ్లగా ప్రస్తుతం అధికార పార్టీ వైపు ఉన్న ఎంపీపీపై అవిశ్వాసం నెగ్గుతుందా లేక వీగుతుందా?అనే ఉత్కంఠ ప్రజలందరిలో నెలకొంది.ఇదివరకే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంప్రదింపులు కూడా జరిగిందని క్యాంపులో ఉన్న పలువురు బీఆర్ఎస్ ఎంపీటీసీలు తమకే అనుకూలంగా ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారు.
ఏది ఏమైనా మరో రెండు మూడు గంటల్లో ఎంపీపీపై అవిశ్వాస ఉత్కంఠకు తెరపడనుంది.