ఇటీవలే 2024 మొదలైందో లేదో అప్పుడే ముచ్చటగా మూడు నెలలు గడిచిపోయాయి.చూస్తుండగానే కాలం వేగంగా పరిగెడుతోంది.
కాగా తెలుగు చిత్రసీమ త్రైమాసిక పరీక్షలు పూర్తి చేసుకున్నట్లే.ఈ మూడు నెలల్లో బాక్సాఫీస్ ముందు బోలెడన్ని చిత్రాలు అదృష్టం పరీక్షించుకున్నాయి.
అందులో అగ్ర తారలు నటించిన భారీ సినిమాలతో పాటు పరిమిత వ్యయంతో రూపొందిన యువతారల చిత్రాలు, అనువాదాలు ఇలా అన్ని ఉన్నాయి.అయితే వాటిలో విజయ ఢంకా మోగించినవి కొన్నైతే అంచనాలు అందుకోలేక చతికిలపడినవి ఎన్నో.
మరి ఈ మూడు నెలల తెలుగు చిత్రసీమ ప్రొగ్రెస్ రిపోర్ట్ ను ఒక్కసారి పరిశీలిస్తే.సర్కారు నౌకరి అనే చిన్న చిత్రంతో కొత్త ఏడాదికి స్వాగతం పలికింది తెలుగు చిత్రసీమ.
జనవరి 1న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి చేదు ఫలితాన్నే అందుకుంది.ఆ మరుసటి వారం ప్రేమకథ, రాఘవ రెడ్డి, డబుల్ ఇంజిన్ లాంటి ఇలా అరడజను వరకు చిన్న చిత్రాలు బాక్సాఫీస్ ముందుకొచ్చాయి.
అన్నీ పరాజయాల్నే అందుకున్నాయి.ఇక ఆ తర్వాత నుంచి సంక్రాంతి సినిమాల( Sankranti Movies ) హంగామా మొదలైంది.
ఈ సారి తెలుగులో పండగ చిత్రాల మధ్య గట్టి పోటీ కనిపించింది.జనవరి 12న మహేశ్ బాబు త్రివిక్రమ్‌ల గుంటూరు కారం,( Guntur Karam ) తేజ సజ్జా ప్రశాంత్ వర్మల హను-మాన్ లు ( HanuMan Movie ) ఒకేసారి థియేటర్లలోకి వచ్చాయి.
వాటిలో చిన్న చిత్రంగా విడుదలైన హనుమాన్ పాన్ ఇండియా స్థాయిలో అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం.
నిజానికి దీనికి ఆరంభంలో తెలుగు రాష్ట్రాల్లో కావాల్సినన్ని థియేటర్లు దక్కకున్నా.మెల్లగా మౌత్ టాక్‌తో స్క్రీన్లను అంతకంతకూ పెంచుకుంటూ పోయింది.ఈ క్రమంలోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.300 కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టి కొత్త రికార్డులు సృష్టించింది.ఇక మహేశ్ చిత్రానికి మంచి ఆరంభ వసూళ్లు దక్కినప్పటికీ ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన దక్కింది.
ఆ తర్వాత 13న వెంకటేశ్ తన 75వ సినిమా సైంధవ్ మూవీతో( Saindhav ) ప్రేక్షకుల్ని పలకరించారు.విభిన్నమైన భావోద్వేగభరిత యాక్షన్ డ్రామాగా ముస్తాబైన ఈ సినిమా సినీ ప్రియుల్ని ఏ మాత్రం మెప్పించలేక పోయింది.
దీంతో ఈ సంక్రాంతి చిత్రాల్లో తక్కువ వసూళ్లు అందుకున్న సినిమాగా నిలిచింది.ఇక ముగ్గుల పండగ రోజున నా సామిరంగ ( Naa Saami Ranga ) అంటూ థియేటర్లలో సందడి చేశారు నాగార్జున.
సంక్రాంతి వైబ్స్‌తో నిండిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే దక్కింది.ఈ చిత్రంతోనే నృత్య దర్శకుడు విజయ్ బిన్ని డైరెక్టర్‌గా వెండితెరకు పరిచయమయ్యారు.పండగ సందడి ముగిసిన మరుసటి వారం బాక్సాఫీస్ ముందు కొత్త విడుదలలు ఏమీ కనిపించలేదు.
నెలాఖరున రిపబ్లిక్ డే బరిలో ధనుష్ కెప్టెన్ మిల్లర్ తో( Captain Miller ) అదృష్టం పరీక్షించుకున్నారు.కానీ, అది ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.నిజానికి దానితో పాటు అదే రోజున శివ కార్తికేయన్ అయలాన్( Ayalaan ) కూడా థియేటర్స్ లోకి రావాల్సి ఉన్నప్పటికీ ఆర్థిక సమస్యల వల్ల ఆఖరి నిమిషంలో వాయిదా పడింది.
సాధారణంగా ఫిబ్రవరి చిత్రసీమకు అన్‌సీజన్.విద్యార్థులకు పరీక్షల సీజన్ కావడంతో పెద్ద చిత్రాలు ఈనెలలో బరిలో దిగేందుకు వెనకాడుతుంటాయి.కానీ, కొన్నేళ్లుగా ఈ అన్‌సీజన్‌లోనే అదిరే విజయాల్ని సొంతం చేసుకుంటూ వస్తోంది తెలుగు చిత్రసీమ.భీమ్లా నాయక్, ఉప్పెన, జాంబిరెడ్డి, నాంది లాంటి ఇవన్నీ గత రెండేళ్లలో ఫిబ్రవరిలో దక్కిన విజయాలే.
కానీ, ఈ ఏడాది ఆ ఆనవాయితీ కొనసాగలేదు.ఈసారి ఫిబ్రవరి బరిలో ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోదగ్గ విజయం దక్కించుకోలేదు.
తొలి వారం అంబాజీపేట మ్యారేజి బ్యాండు, కిస్మత్, హ్యాపీ ఎండింగ్,బూట్‌కట్ బాలరాజు.ఇలా దాదాపు అరడజనుకు పైగా సినిమాలు విడుదల అయ్యాయి.
ఏదీ చెప్పుకోదగ్గ స్థాయిలో సత్తా చాటలేదు.సుహాస్ నటించిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు సినిమాకి మంచి ప్రయత్నంగా పేరొచ్చినప్పటికీ అది వసూళ్లను ప్రభావితం చేయలేకపోయింది.
ఫిబ్రవరి రెండో వారంలో రవితేజ ఈగల్ మూవీతో( Eagle Movie ) పాటు రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో నటించిన అనువాద చిత్రం లాల్ సలాం( Lal Salaam ) బాక్సాఫీస్ బరిలో పోటీ పడ్డాయి.ఆ మరుసటి వారం సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన తో ప్రేక్షకుల్ని పలకరించారు.దీనికి మంచి టాక్ వచ్చినప్పటికీ వసూళ్ల పరంగా నిరుత్సాహ పరిచింది.మూడో వారంలో మమ్ముట్టి నటించిన అనువాద చిత్రం భ్రమయుగం, మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా, రాజధాని ఫైల్స్, సిద్ధార్థ్ రాయ్ తదితర చిన్న సినిమాలు విడుదలయ్యాయి.
మార్చి తొలి వారం వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ తో పాటు, భూతద్దం భాస్కర్ నారాయణ, చారి 111, ఇంటి నెంబర్ 13 తదితర సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి.కానీ, వాటిలో ఏ ఒక్కటీ ఆశించిన ఫలితాన్ని అందివ్వలేదు.