మొక్కజొన్న పంటను జీరో టిల్లెజ్ విధానంలో సాగు చేసి అద్భుతమైన ఫలితాలు సాధించారు సిద్దిపేట జిల్లా రైతులు.వరి పంట కోసిన అనంతరం భూమిని దుక్కి చదును చేసి మొక్కజొన్న విత్తనాలను నాటడాన్ని జీరో టిల్లెజ్ అంటారు.
అంటే ఈ పద్ధతి ద్వారా వరి పొలాల్లో, మొక్కజొన్న సాగు చేసి అధిక దిగుబడి పొందవచ్చు.ఇక తక్కువ శ్రమతో పండించే పంటలలో ఒకటి ఈ మొక్కజొన్న పంట.
వ్యవసాయ అధికారులు వరి పొలాల్లో జీరో టిల్లెజ్ పద్ధతి ద్వారా మొక్కజొన్న పంట పై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.ఇక వరి తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో ఈ మొక్కజొన్న పంట పండిస్తున్నారు.
ఈ జీరో టిల్లెజ్ విధానం ద్వారా దాదాపు సగానికి పైగా పెట్టుబడి ఆదా అవుతుంది.పైగా మొక్కజొన్న పశువులకు మేతగా, వివిధ పరిశ్రమలలో ముడిసారుగా, ఆహార పంటగా వినియోగిస్తుండడంతో మొక్క జొన్న సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతుంది.
ఇక యాసంగిలో నీటి కొరత ఎక్కువగా ఉండడంతో వరికి బదులు మొక్కజొన్న సాగు ఉత్తమం.నీరు ఆదా అవడంతో పాటు వాతావరణ కాలుష్యాన్ని దాదాపుగా నివారించవచ్చు.పైగా ఈ పద్ధతి ద్వారా సాగు చేస్తే కలుపు సమస్య కూడా చాలావరకు ఉండదు.ఇక అక్కడక్కడ ఉన్న కలుపును వెంటనే తొలగిస్తే పెట్టుబడి ఆదా అవుతుంది.
కొంతమంది రైతులకు సరియైన అవగాహన లేక వరి పంట తర్వాత భూమిని ఆరు నెలల పాటు అలాగే ఏ పంట వేయకుండా వదిలేస్తున్నారు.కాస్త నీరు ఉన్న పొలాలలో ఈ పద్ధతి ద్వారా మొక్కజొన్న పంటను పండిస్తే ఒకే సంవత్సరంలో రెండు లేదా మూడు పంటలు పొంది మంచి లాభాన్ని పొందవచ్చని వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.