వైసీపీ ఆధ్వర్యంలో నేడు బీసీల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.ఈ కార్యక్రమంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అన్ని బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, బీసీలకు రిజర్వేషన్ల అంశాన్ని రాజ్యాంగపరమైన హక్కుగా చేయాలన్నదే సీఎం జగన్ లక్ష్యం, తమ పార్టీ వైఖరి అని పేర్కొన్నారు.అందుకే రాజ్యసభలో బీసీ రిజర్వేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టామని వెల్లడించారు.
బీసీలకు జనాభా ఆధారంగా రిజర్వేషన్ కల్పించాలన్నదే తమ సిద్ధాంతం అని అని విజయసాయి స్పష్టం చేశారు.తాము బీసీ జనాభా గణనను కోరామని తెలిపారు.
బీసీలకు సమన్యాయం జరగాలని సీఎం జగన్ ఎప్పుడూ ఆకాంక్షిస్తుంటారని, బీసీల ఆత్మగౌరవాన్ని పెంచింది సీఎం జగన్ అని వివరించారు.
మంత్రి జోగి రమేశ్ మాట్లాడుతూ, ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జన సభతో ఏపీ రాజకీయ ముఖచిత్రం మారిపోయిందని అన్నారు.
టీడీపీ హయాంలో బీసీలను బానిసలుగా వాడుకున్నారని మండిపడ్డారు.సీఎం జగన్ ఆ పరిస్థితిని మార్చారని, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి, ప్రోత్సహించారని కొనియాడారు.సీఎం జగన్ కు బీసీలంతా అండగా నిలవాలని జోగి రమేశ్ పిలుపునిచ్చారు.మరో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఏలూరు బీసీ గర్జన సభలో ప్రకటించిన డిక్లరేషన్ అమలు చేసి బీసీలకు సముచిత గౌరవం ఇచ్చిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు.
తాను బీసీనే అయినా, రాష్ట్రంలో ఎన్ని బీసీ కులాలు ఉన్నాయో తనకు తెలియదని, కానీ బీసీల్లో 136 కులాలు ఉన్నాయని వెలికితీసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని కారుమూరి కీర్తించారు.