జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ వ్యాప్తంగా పర్యటించి జనసేనకు ఊపు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.దీనిలో భాగంగానే బస్సు యాత్రను చేపట్టి ఎన్నికలు ముగిసే వరకు ఈ యాత్రను కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ మేరకు సినిమా షెడ్యూల్ కూడా త్వరగా ముగించుకుని , ఎన్నికలు ముగిసే వరకు సినిమా షూటింగులకు దూరంగా ఉండాలని పవన్ నిర్ణయించుకున్నారు.పూర్తిగా రాజకీయాలకే సమయం అంతా కేటాయించాలని పవన్ భావిస్తున్నారు.
దీనికోసం ఆయన ప్రత్యేకంగా షెడ్యూల్ రూపొందించుకున్నారు.
తాను చేపట్టబోయే బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో పాటు, ఈ యాత్ర సజావుగా సాగే విధంగా సరికొత్తగా ఒక ప్రత్యేక వాహనాన్ని పవన్ తయారు చేయిస్తున్నారు.
దాదాపు ఈ వాహనం డెలివరీకి సిద్ధంగా ఉంది.తుదిమెరుగులు దుద్ది డెలివరీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ముంబైలో ఈ ప్రత్యేక వాహనం తయారవుతోంది.దేశవ్యాప్తంగా టీ టైం అవుట్లెట్స్ ప్రారంభించి యువ పారిశ్రామికవేత్తగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న టీ టైం ఉదయ్ జనసేనలో చేరారు.
ప్రస్తుతం ఈ వాహనాన్ని ఆయన ఆధ్వర్యంలోనే రూపొందిస్తున్నారు.అయితే ఈ యాత్రలో ప్రత్యేక ఆకర్షణ ఉండే విధంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తూనే వాహనానికి ప్రత్యేక రంగును కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం.
బాడీ దృఢంగా ఉండడంతో పాటు, మిలటరీ కి చెందిన ఆకుపచ్చ రంగును ఈ వాహనానికి వాడబోతున్నారు.అచ్చం మిలటరీ వాహనం మాదిరిగానే పవన్ యాత్ర చేయబోయే వాహనానికి తుది మెరుగులు దుద్దుతున్నారు.ఈ వాహనం నుంచి పవన్ నేరుగా టాప్ మీదకు వెళ్లే విధంగా ఏర్పాట్లు, అలాగే వాహనం బాడీకి రెండు వైపులా గార్డులు నిలబడే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ రూపొందించిన చైతన్య రథం మాదిరిగానే పవన్ యాత్ర రథాన్ని ప్రత్యేకంగా రూపొందిస్తుండడం తో దీనిని ఎప్పుడు చూస్తామా అనే ఆసక్తి పవన్ అభిమానుల్లోనూ, జనాల్లోనూ నెలకొంది.