అఫ్గానిస్థాన్ లో తమను విమర్శించేవారిని కఠినంగా అణచివేయాలని తాలిబన్లు మరోసారి నిర్ణయించారు.తమ ప్రభుత్వం ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగులనుగానీ, మేధావులనుగానీ.
మాటలు, సంజ్ఞలులాంటి ఏ రూపంలో విమర్శించినాసరే శిక్షార్హులంటూ తాజాగా ఆదేశాలు జారీ చేశారు.ప్రభుత్వ సిబ్బందిపైనా, అధికారులపైనా ఆరోపణలు చేసినవారికి ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపారు.
తాలిబన్ల సుప్రీంనేత ముల్లా హేబతుల్లా అఖుండ్ జాదా ఆదేశాల మేరకు తాలిబన్ల అధికార ప్రతినిధి జబీవుల్లా ముజాహిద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.వీటి అమలును షరియా బాధ్యతగా ప్రజలు, మీడియా స్వీకరించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.
అఫ్గాన్‌లోని స్థానిక సామాజిక మాధ్యమాలు, టీవీ చర్చల్లో పలువురు ఎప్పటికప్పుడు తాలిబన్ ప్రభుత్వ విధానాలపై విమర్శలు సాగిస్తున్నారు.ముఖ్యంగా బాలికా విద్యపై ఆంక్షలు, మహిళల వస్త్రధారణపై ఆంక్షలు, మానవ హక్కుల ఉల్లంఘనలపైనా ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజా ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇకనుంచి ఇలాంటి విమర్శలను ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంగా పరిగణించనున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వంపై విమర్శలు పరోక్షంగా శత్రువులకు సాయం చేస్తాయని ఆదేశాల్లో పేర్కొన్నారు.అయితే.
తమకు శత్రువులు ఎవరన్నదానిపై వివరణ ఇవ్వలేదని అమెరికాకు చెందిన ఓ వార్తాసంస్థ వెల్లడించింది.ప్రస్తుతమక్కడ రెసిస్టెన్స్ ఫ్రంట్ పేరుతో కొందరు తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు.
ఈ సంస్థకు చెందినవారు తాలిబన్ల విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
తాజా ఆదేశాలతో దేశంలో వాక్‌స్వాతంత్ర్యం, భావప్రకటనా స్వేచ్ఛ మరింత దిగజారతాయని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.తాలిబన్లు ఇప్పటికే సోషల్ మీడియాలో తమను విమర్శించిన కొంతమందిని అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టినట్లు కొన్ని హక్కుల సంస్థలు తమ నివేదికల్లో వెల్లడించాయి.అఫ్గాన్‌లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టులపైనా హింస రెట్టింపు అయ్యిందని జర్నలిస్ట్ సంఘాలు విమర్శించాయి…
.