ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో భాగంగా రువాండాలోని భారతీయ సమాజం అందించిన సహకారాన్ని ప్రశంసించారు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్.తూర్పు ఆఫ్రికా దేశంలో తన పర్యటన సందర్భంగా భారతీయ కమ్యూనిటీతో ముచ్చటించిన ఆయన.
మనదేశ పురోగతి గురించి ప్రస్తావించారు.జూన్ 22 నుంచి 25 మధ్య జరిగే 26వ కామన్‌వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ (సీహెచ్‌వోజీఎం)కి హాజరయ్యేందుకు జైశంకర్ రువాండాకు వచ్చారు.
జూన్ 24 నుంచి 25 వరకు జరిగే కామన్‌వెల్త్ సమ్మిట్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ తరపున జైశంకర్ ప్రాతినిథ్యం వహిస్తారు.కోవిడ్ 19 మహమ్మారి కారణంగా గతంలో రెండుసార్లు వాయిదాపడిన సీహెచ్‌వోజీఎంకి భారత ప్రతినిధి బృందానికి జైశంకర్ నాయకత్వం వహిస్తున్నారు.
కిగాలీలోని భారతీయ కమ్యూనిటీతో సంభాషించడం సంతోషంగా వుందని.వారు భారతదేశ పురోగతి గురించి మాట్లాడారని విదేశాంగ మంత్రి ట్వీట్ చేశారు.
భారత్- రువాండా మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు వారు చేసిన సహకారాన్ని ప్రశంసించారు.కిగాలీలో జరిగే కామన్‌వెల్త్ ఈవెంట్‌లలో పాల్గొనే భారతీయులు కూడా తనను కలిశారని జైశంకర్ పేర్కొన్నారు.
అంతకుముందు కెన్యా కేబినెట్ సెక్రటరీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ రేచెల్ ఒమామోతో సమావేశమై ఉక్రెయిన్ వివాదం గురించి చర్చించినట్లు ఆయన ట్వీట్‌లో తెలిపారు.ఆహారం, ఇంధనం, ఎరువుల భద్రతతో పాటు యూఎన్ఎస్‌సీలో కొనసాగుతోన్న సహకారాన్ని గుర్తుచేసుకున్నట్లుగా జైశంకర్ పేర్కొన్నారు.
జూలై 2018లో ప్రధాని మోడీ రువాండాలో పర్యటించారు.తూర్పు ఆఫ్రికా దేశంలో ఒక భారత ప్రధాని చేసిన తొలి పర్యటనే అదే.రువాండాలోని భారత హైకమీషన్ వెబ్‌సైట్ ప్రకారం.అక్కడ దాదాపు 3000 మంది భారతీయ పౌరులు, భారత సంతతి వ్యక్తులు వున్నారు.
ఆ దేశంలోని ఏకైక చక్కెర శుద్ధి కర్మాగారం, ఏకైక ఆధునిక టెక్స్‌టైల్ మిల్లు, సబ్బు, సౌందర్య సాధనాల కర్మాగారాలు భారత సంతతి వ్యక్తుల యాజమాన్యంలోనే వున్నాయి.కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న అస్సాంకు చెందిన లక్ష్మీ టీ అనే కంపెనీ తేయాకు రంగంలో భారత్ నుంచి పెట్టుబడులు పెట్టింది.
టీవీఎస్ మోటార్‌బైక్‌లు రువాండాలో బాగా ప్రాచుర్యం పొందాయి.అక్కడి టెలికాం రంగంలో మనదేశానికి చెందిన ఎయిర్‌టెల్ కూడా ఒకటి.