హిందూ సంప్రదాయం ప్రకారం మనకు తెలిసిన అన్ని పండుగలను ఘనంగా జరుపుకుంటాం.ప్రత్యేకంగా చేసుకునే పండగల మాట అటుంచితే… ప్రతి ఏకాదశిని పర్వదినంగా భావించే సంప్రదాయం మనకుంది.
మిగిలిన రోజులతో పోల్చితే ఆ తిథిని ఉత్తమంగా భావిస్తారు.అందుకే ఆ రోజు చాలా మంది ఉపవాసాలుంటారు.
ఏకాదశితో పాటు పౌర్ణమి నాడు కూడా ప్రత్యేక పూజలు చేస్తారు.
ఆధ్యాత్మిక చింతనకు అనువైన రోజుగా ఏకాదశిని చెబుతారు.
మనిషికి అయిదు కర్మేంద్రియాలు, అయిదు జ్ఞానేంద్రియాలు ఉంటాయి.మనసుతో కలిపితే అవి పదకొండు.అంటే ఏకాదశ ఇంద్రియాలు.దీన్ని ఆలంబనగా చేసుకునే ఏకాదశి తిధికి ప్రాధాన్యం ఏర్పడింది.ఈ పదకొండు ఇంద్రియాలూ లోపరహితంగా ఉంటే అది సంపూర్ణత్వం.లోపం లేకుండా ఉండడాన్ని వికుంఠం అంటారు.
అలాంటి లోపరహితంగా తీర్చిదిద్దే రోజును వైకుంఠ ఏకాదశిగా భావిస్తారు.
ధనుర్మాసంలో పూర్ణిమకు ముందువచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు.
ఇది మార్గశిర మాసంలోగానీ, పుష్యమాసంలోగానీ వస్తుంది.దీంతోపాటు ఆషాఢ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి తొలి ఏకాదశిగా ప్రసిద్ధి పొందింది.
స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు.సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది.
తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశి నాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం.ముక్కోటి ఏకాదశి, తొలి ఏకాదశి రెండూ విష్ణు ఆరాధనకు మనకు అవకాశం ఇచ్చే పర్వదినాలు.
ఇవికాక ప్రతినెలా రెండు పక్షాల్లో వచ్చే ఏకాదశి తిథులు రెండూ పర్వదినాలే.