కరోనా వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలు దెబ్బతింటున్నాయి.నిర్మాణం, రిటైల్, రవాణా, వాణిజ్యం, టూరిజం ఇలా అన్నిటి పరిస్ధితి దారుణంగా వుంది.
వాటితో పాటు అత్యంత కీలకమైన విద్యా రంగం కూడా ఈ పెను సంక్షోభం ధాటికి విలవిలలాడుతోంది.ఇప్పటికే అన్ని దేశాల్లోనూ కీలక పరీక్షలు వాయిదాపడగా, ఈ ఏడాదైనా అడ్మిషన్లు వుంటాయా లేదా అన్న ప్రశ్నలు ఎంతోమందిని వేధిస్తున్నాయి.
ఆర్ధిక వ్యవస్థలో విద్యా రంగం కూడా భాగమే.ఇక్కడ చదువు ఒక్కటే ప్రామాణికంగా తీసుకోకూడదు.
దీనిని ఆధారంగా చేసుకుని మనుగడ సాగిస్తున్న కొన్ని ఇతర రంగాలు కూడా ఆదాయాన్ని పొందుతున్నాయి.
కోవిడ్ కారణంగా దేశ విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో వున్న విద్యార్ధుల్ని ఇప్పటికే ఇంటికి పంపించేశారు.
ఎన్నో కోర్సులు ఆన్లైన్ కిందకి వచ్చేశాయి.లాక్డౌన్లు, ఆంక్షలు ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో క్యాంపస్‌లో విద్యార్ధుల కళ అన్నదే లేకుండా పోతుంది.
ఇక ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఫిలిప్పిన్స్, చైనా వంటి దేశాల్లో భారతీయ విద్యార్ధులు పెద్ద సంఖ్యలో చదువుకుంటున్నారు.
వీరి వల్ల ప్రతి ఏటా వేల కోట్ల రూపాయల ఆదాయం ఆయా దేశాల ఆర్ధిక వ్యవస్థలకు సమకూరుతోంది.అయితే కోవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో పలు దేశాల్లో చదువుకుంటున్న విద్యార్ధులు తిరిగి స్వదేశానికి వచ్చేస్తున్నారు.
భారతీయులు విదేశాలకు వెళ్లినట్లే.మన దేశ విద్యా ప్రమాణాలు, బోధన, అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు, వాతావరణం, సంస్కృతిని ఇష్టపడి ఎంతో మంది విదేశీయులు, ఇతర దేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు తమ పిల్లలను భారత్‌లో చదువుకునేందుకు పంపుతున్నారు.కానీ కరోనా కారణంగా మన దేశంలో చదవాలనుకునే విదేశీ విద్యార్ధుల అడ్మిషన్లు ఈ ఏడాది భారీగా పడిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.ఉదాహరణకు ప్రతిష్టాత్మక బొంబే యూనివర్సిటీ లెక్కల్ని తీసుకుంటే.2018-19, 2019-20 విద్యా సంవత్సరాల్లో అక్కడ అడ్మిషన్ పొందిన విదేశీ, ఎన్నారై విద్యార్థుల సంఖ్య వరుసగా 209, 227 ఉండగా. 2020-21 సంవత్సరంలో వారి సంఖ్య సగానికి పడిపోయింది.
ఈ ఏడాది కేవలం 101 మంది విద్యార్థులు మాత్రమే ఇక్కడ అడ్మిషన్ పొందినట్టు అధికారులు చెబుతున్నారు.
మన పొరుగు దేశాలైన నేపాల్, ఆఫ్గనిస్తాన్‌ల నుంచి బొంబే యూనివర్సిటీలో చదువుకునేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్ధులు వస్తారు.కానీ ఏడాది దేశంలో కోవిడ్‌కు ముఖ్య కేంద్రంగా ముంబై నిలిచిన సంగతి తెలిసిందే.బహుశా ఈ పరిస్ధితులకు భయపడి.
థర్డ్ వేవ్‌ను దృష్టిలో వుంచుకుని విదేశీ, ఎన్ఆర్ఐ విద్యార్ధులు ఇక్కడకు రావడానికి మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది.ఈ ఒక్క యూనివర్సిటీయే కాదు దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లోనూ విదేశీ విద్యార్ధులు తగ్గినట్లుగా తెలుస్తోంది.