ప్రపంచ దేశాల ప్రజలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది.కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ ను జయించడం సాధ్యమవుతుందని ప్రజలు భావిస్తున్నారు.చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కరోనానేమో అని ప్రజలు హడలిపోతున్నారు.
నాలుకపై నోటిపూత వచ్చినా కరోనానేమోనని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
మొదట్లో జ్వరం, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు మాత్రమే కరోనా లక్షణలుగా ఉండగా రానురాను కొత్త లక్షణాలు ఈ జాబితాలో చేరుతున్నాయి.
ఈ మధ్య కాలంలో చాలామందిలో కొంచెం కారం తిన్నా మండిపోయే నోటి అల్సర్ వస్తోంది.మరి కొంతమందిలో జ్వరం కూడా వస్తుండటంతో కరోనానేమో అని భయపడుతున్నారు.మరి నోటిపూతను కరోనా లక్షణంగా భావించవచ్చా….? అంటే నోటిపూతను కరోనా లక్షణంగా భావించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటివరకు నోటిపూత మాత్రమే వచ్చిన వారిలో కరోనా నిర్ధారణ అయినట్లు ఎక్కడా వెల్లడి కాలేదని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.అయితే నోటిపూతతో పాటు ఇతర కరోనా లక్షణాలు కనిపిస్తే మాత్రం వైరస్ సోకిందని అనుమానించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.
జ్వరం, దగ్గు, రుచి వాసనను గుర్తించలేకపోవడం కరోనా ప్రధాన లక్షణాలని… ఈ లక్షణాలు కనిపించకుండా కేవలం నోటిపూత మాత్రమే కనిపిస్తే కరోనా కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అయితే నోటిపూత కనిపించకపోయినా కండరాల నొప్పులు, డయేరియా, కండ్ల కలక, చర్మంపై దద్దుర్లు, కడుపునొప్పి, వికారం లాంటి లక్షణాలు కనిపిస్తే కరోనా పరీక్షలు చేయించుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
మరోవైపు దేశంలో గత రెండు రోజులుగా 80,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి.