కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలని భయాందోళనకి గురి చేస్తుంది.లక్షల మంది ఇప్పటికే కరోనా బారిన పడ్డారు.
దేశాల ఆర్ధిక వ్యవస్థలు కూడా కుప్పకూలిపోయే పరిస్థితి నెలకొంది.లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.
మరో వైపు దేశాధినేతలని కూడా కరోనా వదలడం లేదు.అలాగే సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడినవాళ్ళలో ఉన్నారు.
ఇప్పటికే ఇంగ్లాండ్ ప్రధాని కరోనా బారిన పడి చికిత్స తీసుకొని బయటపడ్డారు.ఇప్పుడు రష్యా ప్రధానమంత్రి మైఖేల్ మిషుస్తిన్ మహమ్మారి కరోనా బారిన పడ్డారు.
గురువారం ప్రధానికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని వచ్చింది.దీంతో తాను సెల్ఫ్ ఐసోలేషన్‌కి వెళ్తున్నట్టు ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌కు మిషుస్తిన్ తెలియజేశారు.కొవిడ్-19 సోకిన ఆయన బదులు తాత్కాలిక ప్రధానిగా ఉప ప్రధాని అంద్రెయ్ బెలోసోవ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.కాగా, మిషుస్తిన్‌కు ఈ ఏడాది ప్రారంభంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే రష్యాలో ఈ వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా లక్షకు పైగా కరోనా బాధితులు ఉన్నారు.1,073 మందిని ఈ మహమ్మారి పొట్టనబెట్టుకుంది. ఇక ప్రపంచంలో చాలా దేశాలు కరోనాకి వాక్సిన్ సిద్ధం చేసే పనిలో పడ్డాయి.
మరోవైపు ఆర్ధిక పరిస్థితులని దృష్టిలో ఉంచుకొని కరోనాతో కలిసి బ్రతకడానికి ప్రజలు మానసికంగా సిద్ధంగా ఉండాలని ప్రముఖులు సైతం సూచిస్తున్నారు.