అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.మిస్సిస్పిప్పిలో శనివారం చోటు చేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో తల్లితో పాటు ఆమె ఆరుగురు పిల్లలు సజీవ దహనమయ్యారు.జాక్సన్‌కు 10 మైళ్ల దూరంలో ఉన్న క్లింటన్‌లోని ఓ ఇంట్లో మంటలు చెలరేగడాన్ని గమనించిన స్థానికులు శుక్రవారం అర్థరాత్రి (తెల్లారితే శనివారం) 12.30 గంటలకు 911కు సమాచారం అందించారు.అయితే అగ్నిమాపక సిబ్బంది వచ్చే సమయానికి ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహూతయ్యింది.రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి 35 నుంచి 40 నిమిషాల పాటు శ్రమించారు.
అనంతరం ఇంటి శిథిలాల నుంచి ఒక ఏడాది నుంచి 33 సంవత్సరాల వయసు గల ఏడుగురి మృతదేహాలను వెలికి తీశారు.ప్రమాదంలో తీవ్రగాయాల పాలైన ఇంటి యజమానిని ఆసుపత్రికి తరలించారు.
కోలుకున్న తర్వాత ఈ సంఘటన గురించి చెప్పడానికి ఆయన ఇష్టపడకపోగా తన కుటుంబాన్ని కోల్పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైయ్యాడు.వారిని రక్షించడానికి చివరి వరకు ప్రయత్నించానని కానీ కాపాడలేకపోయానని ఆయన కన్నీటిపర్యంతమయ్యారు.
రికార్డుల ప్రకారం ప్రమాదానికి గురైన ఆ ఇంటిని 1951లో నిర్మించినట్లు నగర ప్రతినిధి మార్క్ జోన్స్ చెప్పారు.అలాగే రాష్ట్ర చీఫ్ డిప్యూటీ ఫైర్ మార్షల్ రికీ డేవీస్ మాట్లాడుతూ మంటలను నివారించడానికి భద్రత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను కోరారు.దయచేసి రాత్రుళ్లు నిద్రపోయే ముందు ఇళ్లలోని ఫైర్ అలారాలు ఆన్ చేసి ఉంచాలని సూచించారు.కాగా అగ్నిప్రమాదానికి దారి తీసిన కారణం ఏమై ఉంటుందనే దానిపై స్పష్టత లేదు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.