తెలంగాణ లో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న సందర్భంలో … టీఆర్ఎస్ పార్టీకి కలవరింతలు మొదలయ్యాయి.ఇప్పటివరకు పక్క పార్టీల నుంచి నాయకులను చేర్చుకోవడమే పనిగా పెట్టుకున్న టీఆర్ఎస్ ప్రస్తుత కీలక సమయంలో తమ పార్టీ నుంచి వలసలు పెరగడంతో అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఇక టీఆర్ఎస్ కు బద్ద విరోధి అయిన కాంగ్రెస్ కీలక నాయకుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా… ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఎంపీలు పార్టీ మారతారు అన్నట్లే చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు.కాంగ్రెస్ లో చేరేందుకు ఇంకా చాలా మంది ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని విశ్వేశ్వర్‌రెడ్డి చెబుతూ… టీఆర్ఎస్ ను మరింత టెన్షన్ పెడుతున్నారు.
విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ మారడం ద్వారా… అటా ఇటా అని ఎటూ ఆలోచించుకోలేకపోతున్న టీఆర్ఎస్ నాయకుల్లో కొంత ధైర్యాన్ని తీసుకురాగలిగారు.విశ్వేశ్వర రెడ్డి వ్యూహాత్మకంగా కేకే, జితేందర్ రెడ్డి, వినోద్ లాంటి వాళ్ల పేర్లను తన ప్రెస్మీట్లో ప్రస్తావించి మరింత టెన్షన్ వాతావరణం తెచ్చి పెట్టారు.టీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ సొంత వ్యాపార సంస్థ.ఆ పార్టీలో ప్రజాస్వామ్యం లేదు.మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేదని, జీ హూజూర్ అంటూ కాలం వెళ్లదీయాలని చెప్పుకొచ్చారు.టీఆర్ఎస్ లో ప్రజాప్రతినిధులకు ఆత్మగౌరవం కొరవడటంతో ఆ పార్టీలో ఇమడలేకనే కాంగ్రెస్ లో చేరా అని విశ్వేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు.
తాను రాజీనామా చేశాక టీఆర్ఎస్ ఎంపీ వినోద్ ఫోన్ చేసి అభినందనలు తెలిపారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో అధికారం మొత్తం ప్రగతి భవన్లో కేంద్రీకృతమై ఉంటుందని కానిస్టేబుల్‌ను బదిలీ చేయాలన్నా హోంమంత్రికి అధికారాలు ఉండవని చెప్పుకొచ్చారు.అంతేకాక టీఆర్ఎస్ అంటే ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ అని జితేందర్‌రెడ్డి ఓ సందర్భంలో తనతో అన్నారని తెలిపారు.తమ మంత్రిత్వ శాఖల్లో జరిగే బదిలీలు, ఇతర పరిణామాలను ఆయా శాఖల మంత్రులు మర్నాడు పత్రికల్లో చదివి తెలుసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు.
పోలీసు అధికారుల బదిలీల గురించి హోం మంత్రి నాయినికి తెలియదని, బడ్జెట్ నోట్ చదివే వరకు ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు బడ్జెట్లోని కేటాయింపులు తెలియని విచిత్ర పరిస్థితి నెలకొందని దుయ్యబట్టారు.