ఒక లోక్ సభ స్థానం మినహా, మిగతా అన్ని అసెంబ్లీ , లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ అధినేత జగన్( YS Jagan Mohan Reddy ) ఇక పూర్తిగా జనాల్లో ఉంటూ, ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు సిద్ధం అయిపోతున్నారు.ఈ మేరకు సిద్ధం సభలు నిర్వహించిన నాలుగు జిల్లాలు మినహా, మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర చేపట్టేందుకు నిర్ణయించుకున్నారు.21 రోజుల పాటు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జగన్ బస్సు యాత్ర కొనసాగనుంది.దీనికి ‘ మేమంతా సిద్ధం ‘ పేరుతో బస్సు యాత్రను నిర్వహించేందుకు జగన్ శ్రీకారం చుట్టాలు.
ఈ బస్సు యాత్రలో ప్రతిరోజు ఒక జిల్లాలో ఉదయం వివిధ వర్గాల ప్రజలతో సమావేశం అయ్యే విధంగా షెడ్యూల్ ను రూపొందించారు.ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే లోగా తొలి విడత ప్రచారం పూర్తి చేసే విధంగా ప్రణాళికను రచించారు.ఈ మేరకు ఈనెల 27న వైయస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కానుంది .21 రోజుల పాటు జరిగే ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లో వైసీపీకి మరింత ఆదరణ పెంచడంతో పాటు, పార్టీ శ్రేణుల్లోనూ ఉత్సాహం పెంచే విధంగా ప్లాన్ చేశారు.
సిద్ధం సభలు జరిగిన విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల జిల్లాలు మినహా, మిగతా అన్ని జిల్లాల్లోనూ ఈ బస్సు యాత్రను జగన్ నిర్వహించనున్నారు. వివిధ వర్గాలు, రంగాల ప్రజలతో జగన్ సమావేశం అవుతారు.ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపరచుకోవడానికి సలహాలు, సూచనలను సేకరిస్తారు.కొంతమంది పార్టీ కార్యకర్తలు, అభిమానులను కూడా ఈ యాత్రలో కలుస్తారు.సాయంత్రం పార్లమెంట్ నియోజకవర్గంలో బహిరంగ సభను నిర్వహిస్తారు.ఈనెల 27న ఇడుపులపాయ( Idupulapaya )లో ఈ యాత్రను ప్రారంభించి, తరువాత వీరపు నాయిని పల్లె, ఎర్రగుంట్ల మీదుగా జగన్ ప్రొద్దుటూరుకు చేరుకుంటారు.
ఎర్రగుంట్ల రోడ్డులోని అయ్యప్ప స్వామి ఆలయం వద్ద జగన్ విడిది చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ కన్యకా పరమేశ్వరి సర్కిల్, సినీ హబ్, ఆర్టీసీ బస్టాండ్, శివాలయం వీధి, రాజు సర్కిల్ ,కొర్రపాడు రోడ్డు మీదగా బస్సు యాత్రను నిర్వహిస్తారు.ఐదు గంటలకు పొట్టిపాడు రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు.దీని కోసం సభ నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
ఈ సభకు కడప పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు.