నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో నల్లగొండ నుండి అధికార ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్(కుందూరు రఘువీర్ రెడ్డి),బీఆర్ఎస్ (కంచర్ల కృష్ణారెడ్డి),బీజేపీ (శానంపుడి సైదిరెడ్డి) ఓకే సామాజిక వర్గానికి చెందిన వారినే తమ అభ్యర్థులను ఖరారు చేశాయి.ఇక భువనగిరి లోక్ సభ స్థానం నుండి బీసీ నినాదం బలంగా వినిపిస్తుండడంతో బీఆర్ఎస్ క్యామ మల్లేశం (కుర్మ),బీజేపీ బూర నర్సయ్య గౌడ్(గౌడ) బీసీ సామాజిక వర్గాలకు టిక్కెట్లు ఇచ్చాయి.
కానీ, అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా భువనగిరిని పెండింగ్ లో పెట్టడంతో టిక్కెట్ ఎవరికి దక్కనుందోననే ఉత్కఠ పెరిగిపోయింది.ఇక్కడి నుండి రెండు ప్రధాన పార్టీలు బీసీలకు పట్టం కట్టడంతో కాంగ్రెస్ పార్టీ కూడా బీసీనే రంగంలోకి దించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక్కడి నుండి బీసీ సామాజిక వర్గంలో బలమైన నేత ఎవరూ లేకపోవడంతో పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఉన్న తీన్మార్ మల్లన్న (మున్నూరుకాపు)టిక్కెట్ ఆశిస్తున్నట్లు సమాచారం.ఒకవేళ తీన్మార్ మల్లన్నకు టిక్కెట్ ఇస్తే బీసీల్లో మూడు ప్రధాన సామాజిక వర్గాలైన (మున్నూరుకాపు,కుర్మ,గౌడ) మధ్య పోరు రసవత్తరంగా మారే అవకాశం లేకపోలేదు.
ఇంతకీ కాంగ్రెస్ అధిష్టానం మదిలో ఏముంది.భువనగిరి లోక్ సభ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరనే దానిపై ఊహాగానాలు ఊపందుకున్నాయి.
నల్లగొండ రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడంతో సామాజిక సమీకరణాల నేపథ్యంలో భువనగిరి తప్పని పరిస్థితుల్లో బీసీ సామాజిక వర్గానికి ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది.ఆల్రెడీ రెండు ప్రధాన పార్టీలు బీసీలకు టిక్కెట్ ఖరారు చేయడంతో కాంగ్రెస్ పార్టీకి కూడా వేరే ఆప్షన్ లేకుండా పోయింది.
దీనితో గత పదేళ్ళుగా అధికార బీఆర్ఎస్ పార్టీ అక్రమాలపై గళమెత్తుతూ అనేక అక్రమ కేసులు ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడ్డ తీన్మార్ మల్లన్న గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి,రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా పార్టీ గెలుపు కోసం కృషి చేశారు.అందులోనూ స్థానికుడు కావడం,ప్రజల్లో మంచి ఆదరణ ఉండడం కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశాలుగా లోకల్ క్యాడర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో మునుగోడు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి,భువనగిరి ఎమ్మేల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య,తుంగతుర్తి ఎమ్మేల్యే మందుల సామేల్ తో ఆయనకు సన్నిత సంబంధాలు ఉండడంతో కాంగ్రెస్ గెలుపు నల్లేరుమీద నడకేనని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలోకి దూకడం,అధికార పార్టీ అభ్యర్థిని పెండింగ్ లో పెట్టడంతో పార్టీ క్యాడర్లో అయోమయం నెలకొంది.
ఇంతకీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మదిలో ఏముంది? ఏ బీసీ నేతపై ఫోకస్ చేసింది?ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.