తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ కు ఎన్నికల సమయం దగ్గరకు వచ్చే కొద్ది టెన్షన్ మీద టెన్షన్ లు వచ్చి పడుతున్నాయి.ముఖ్యంగా ఎప్పటి నుంచో బీఆర్ఎస్ ను టెన్షన్ పెడుతున్న ఎన్నికల గుర్తులు వ్యవహారం నుంచి కోర్టుల ద్వారా ఉపశమనం పొందాలని బీఆర్ఎస్( BRS ) భావించింది.
గతంలో జరిగిన అనేక ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తు అయినా కారును పోలి ఉండే రోడ్డు రోలర్ , కెమెరా వంటి చాలా ఫ్రీ సింబల్స్ కారణంగా చాలా నియోజకవర్గాల్లో ఓటమిని చవి చూడడంతో పాటు , బీఆర్ ఎస్ కు పడాల్సిన చాలా ఓట్లలో చీలిక వచ్చింది.దీంతో ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి కారు గుర్తును పోలిన రోటి మేకర్ , గడియారం, రోడ్డు రోలర్ వంటి గుర్తులను తప్పించాలని బీఆర్ఎస్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతూనే వస్తోంది .

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం కు బీఆర్ఎస్( BRS ) విజ్ఞప్తి చేసింది .ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి ఆ గుర్తులు తప్పించాలని కోరింది.దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది .తాజాగా ఈ పిటిషన్ ను విచారించిన ధర్మసనం దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది.కారు గుర్తును పోలిన గుర్తులు రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా హైకోర్టు కొట్టివేసిన పిటిషన్ పై ఆలస్యంగా వచ్చారని జస్టిస్ అభయ్ ఎన్ ఓఖా , జస్టిస్ పంకజ్ మిశ్రా ధర్మాసనం పేర్కొంది.
అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ 240 రోజులు ఆలస్యంగా ఎలాగా వస్తారని ధర్మసనం ప్రశ్నించింది.ఈ పిటిషన్ పై విచారణ చేపట్టడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది.

తమకు హైకోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు కోరగా , కావాలంటే హైకోర్టుకు వెళ్లవచ్చునని సుప్రీంకోర్టు అనుమతించింది.అయితే మెరిట్ ఆధారణంగానే అక్కడ విచారణ జరుగుతుందని సుప్రీంకోర్టు చెప్పింది.కీలకమైన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది .మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో బీఆర్ ఎస్ ( BRS )కు ఎప్పటి నుంచో ఇబ్బందికరంగా మారిన ఎన్నికల గుర్తు ల టెన్షన్ వీడేలా కనిపించడం లేదు.