చిత్రం : హైపర్
బ్యానర్ : 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్
దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్
నిర్మాతలు : గోపి ఆచంట, రామ్ ఆచంట, అనీల్ సుంకర
సంగీతం : ఘిబ్రాన్, మణిశర్మ (నేపథ్య సంగీతం)
విడుదల తేది : సెప్టెంబరు 30, 2016
నటీనటులు : రామ్, రాశీ ఖన్నా, సత్యరాజ్, రావు రమేష్, మురళీశర్మ, కే.విశ్వనాథ్, సుద్దాల అశోక్ తేజ తదితరులు
మాస్ సినిమాలంటూ చేతులు కాల్చుకోని, ఈ ఏడాదిని ఫ్రెష్ గా నేను శైలజా లాంటి బ్లాక్ బస్టర్ తో మొదలుపెట్టిన రామ్, మళ్ళీ హైపర్ అంటూ మాస్ బాట పట్టాడు.
ఇంతకుముందు తనకు కందిరీగ లాంటి బ్లాక్ బస్టర్ ని అందించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు అవడం, భారీ చిత్రాలు నిర్మించే 14 రీల్స్ ఈ చిత్రాన్ని నిర్మించడంతో హైపర్ కి మంచి హైప్ వచ్చింది.మరి హైప్ తగ్గట్టుగా సినిమా నిలబడిందా లేదా తెలుసుకోవాలంటే ఈ సమీక్షను చదవండి.
కథలోకి వెళ్తే …
సూర్య (రామ్), ఓ హైపర్ యాక్టివ్ అబ్బాయి.ఇతనికి చిన్నప్పటినుంచీ నాన్న నారాయణమూర్తి (సత్యరాజ్) అంటే పిచ్చి.ఆ పిచ్చిప్రేమ శృతిమించుతూ ఉంటుంది.నారాయణమూర్తి ఒక నిజాయితీ గల ప్రభుత్వ ఉద్యోగి
మరోవైపు మినిస్టర్ రాజప్ప (రావు రమేష్), ప్రభుత్వ రూల్స్ పక్కనపెట్టి ఒక మాల్ కడుతూ ఉంటాడు.
ఆ బిల్డింగ్ మధ్యలోనే ఆగిపోతుంది.దానికి కారణం ప్రభుత్వ ఉద్యోగి అయిన నారాయణమూర్తి తన నిజాయితీని అమ్ముకోలేక సంతకం పెట్టకపోవడమే.
దాంతో మినిస్టర్ రాజప్ప తన బలగాన్నంతా ఉపయోగిస్తూ నారాయణమూర్తితో సంతకం పెట్టించడానికి ఇబ్బందులు సృష్టిస్తూ ఉంటాడు
నాన్నకి చిన్నగాయం అయినా తట్టుకోలేని సూర్య, మినిస్టర్ కి ఎదురుగా ఎలా వెళ్ళాడు? తన తండ్రి నిజాయితీని ఎలా కాపాడుకోగలిగాడు అనేది మిగితా కథ.అన్నట్లు మధ్యమధ్యలో రాశీఖన్నా వస్తూపోతూ ఉంటుంది
నటీనటుల నటన గురించి
ఇదే రామ్ నటించిన దేవదాసు, రెడీ, కందిరీగ, శివం, ఇంకొన్ని సినిమాల్లో రామ్ ఎలా ఉన్నాడో, హైపర్ లో కూడా అలానే ఉన్నాడు.నటనలో కాని, ఆహార్యంలో కాని మార్పులు లేదా కొత్తదనం ఆశించడం ప్రేక్షకుల అత్యాశే.రాశీఖన్నా మరోసారి గ్లామర్ డాల్ గా కనిపించింది.రాశీ అందాలు మాస్ ప్రేక్షకులని ఆకట్టుకోవచ్చు.రావు రమేష్ మొదటిసారి అవసరానికి మించి నటిస్తున్నారేమో అని అనిపించింది
మురళీశర్మ, పోసాని, ప్రభాస్ శ్రీను, షియాజీ షిండే ఎప్పటిలాగే ఉన్నారు.
సినిమాలో మంచి పాత్ర ఎవరికి దక్కింది అంటే, అది ముమ్మాటికి సత్య రాజ్ కే.గవర్నమెంటు ఆఫీసులో, ప్రభుత్వ ఉద్యోగి సంతకం విలువ గురించి ఆయన చెప్పిన సంభాషణలు సినిమాకే హైలైట్.చివర్లో కే.విశ్వనాథ్ సిఎంగా కనిపిస్తే, సుద్దాల అశోక్ తేజ సడన్ సర్ప్రైజ్ లాగా, ఉన్న ఒకటిరెండు సన్నివేశాల్లో ఆకట్టుకున్నారు
సాంకేతికవర్గం పనితీరు
హీరోగా, స్టార్ గా నాని ఎదుగుదల ఎలా సాధ్యపడిందో, నానిని చూస్తే కాదు, రామ్ ని చూస్తే తెలిసిపోతుందేమో.నేను శైలజా లాంటి తాజా చిత్రం ఇలా వచ్చిందో లేదో రామ్ మళ్ళీ మూసలోకి వెళ్ళిపోయాడు.సంతోష్ శ్రీనివాస్ ఎంచుకున్న లైన్ మురుగదాస్ సినిమాలాగా అనిపించినా, దాన్ని సినిమాగా మలిచిన విధానం మాత్రం మురుగదాస్ సినిమా అంత భావోద్వేగంగా లేదు, దురదృష్టవశాత్తు సంతోష్ శ్రీనివాస్ సినిమా అంత ఎంటర్టైనింగ్ గా కూడా లేదు.
అలాగని పూర్తిగా తీసిపారేసే సినిమా కాదు.మాస్ ప్రేక్షకులకి నచ్చే అంశాలు మెండుగా ఉన్నాయి.మాస్ ప్రేక్షకులు టైమ్ పాస్ కోసం ఈ సినిమాని ఆదరించవచ్చు (మోయవచ్చు)
హైలైట్స్ :
* ఒకటిరెండు సన్నివేశాలు
* రాశీ గ్లామర్, మాస్ అంశాలు
డ్రా బ్యాక్స్ :
* ఆసక్తిగా లేని స్క్రీన్ ప్లే
* పేలని కామెడి
* పాటలు
* అన్ని వర్గాల ప్రేక్షకులని కూర్చోబెట్టలేని టేకింగ్
చివరగా :
మాస్ ప్రేక్షకుల కోసమే