భారత్ లో చాప కింద నీరులా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి యువతతో పోలిస్తే వృద్ధులపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి విదితమే.కరోనా వ్యాప్తి దృష్ట్యా చాలా మంది సీనియర్ స్టార్ హీరోలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినా షూటింగ్ లకు హాజరు కావడానికి ఇష్టపడటం లేదు.
వైరస్ బారిన పడితే వయస్సు పై బడిన వారిలో ప్రాణాలకే ప్రమాదం.అయితే ఏడు పదుల వయస్సులో రజినీకాంత్ షూటింగ్ కు హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నాడు.రజినీకాంత్ తీసుకున్న నిర్ణయాన్ని అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.ఎట్టి పరిస్థితుల్లోనూ షూటింగ్ లకు రజనీ హాజరు కాకూడదని సోషల్ మీడియా వేదికగా ఆయన అభిమానులు కోరుతున్నారు.
కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు ఇంటికే పరిమితం కావాలని రజినీకాంత్ కు సూచనలు చేస్తున్నారు.అయితే రజినీ మాత్రం షూటింగ్ ల విషయంలో మొండిగా ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.
తన వల్ల నిర్మాతలు, దర్శకులకు సమయం వృథా కాకూడదని రజినీకాంత్ భావిస్తున్నారు.గత కొన్ని నెలలుగా ఇంటికే పరిమితమైన రజినీకాంత్ మరో రెండు మూడు నెలలు షూటింగ్ లకు దూరంగా ఉంటే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
షూటింగ్ లకు కేంద్రం అనుమతిచ్చినా పదేళ్లలోపు పిల్లలు, అరవై ఏళ్లు దాటిన వృద్ధులు ఇళ్లకే పరిమితం కావాలని కేంద్రం సూచనలు చేస్తోంది.
ఈ నెల 15 నుంచి హైదరాబాద్ లో జరగబోయే షూటింగ్ లో రజనీకాంత్ పాల్గొనబోతున్నారు.
అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సందర్భాల్లో వైరస్ బారిన పడే అవకాశాలు ఉంటాయి.శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా 2021 జనవరిలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
రజనీకాంత్ చెన్నై నుంచి హైదరాబాద్ కు కారులో చేరుకోనున్నారు.రజినీకి కరోనా వైరస్ సోకకుండా దర్శకనిర్మాతలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.