క‌ర్ణాట‌క‌లో ప‌వ‌న్‌కు జేడీఎస్ ఇచ్చిన టార్గెట్ ఇదే...       2018-04-29   00:19:07  IST  Bhanu C

క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల పోరు ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. కాంగ్రెస్‌, బీజేపీ, జేడీఎస్‌లు ప్ర‌చారంలో దూసుకుపోతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో అక్క‌డ స్థిర‌ప‌డిన తెలుగువారి ఓట‌ర్లు కీల‌కంగా ఉన్నాయి. ఉత్త‌ర క‌ర్ణాక‌ట‌, త‌దిత‌ర ప్రాంతాలు క‌లుపుకొని మొత్తం 12జిల్లాల్లోని 60 నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు ఓట‌ములను ప్ర‌భావితం చేసే స్థాయిలో తెలుగుఓట‌ర్లు ఉన్నారు. అయితే ఈసారి తెలుగు ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేసే ప్ర‌త్యేక అంశాలు ఉన్నాయి. తెలుగుఓట‌ర్ల‌ను త‌మ వైపు తిప్పుకునేందుకు ఆయా పార్టీలు ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌లు ప‌లువురు తెలుగు హీరోల‌తో ప్ర‌చారం చేయించ‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాయి.

తెలంగాణలోని హైదరాబాద్, మహబూబ్ నగర్, ఏపీలోని అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన వారు క‌ర్ణాట‌క‌లో చాలామంది ఉన్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా తెలుగువారి ఓట్ల‌కు అత్యంత ప్రాధాన్యం ఏర్ప‌డింది. జేడీఎస్ త‌రుపున జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌చారం చేస్తార‌ని ఆ పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఉత్త‌ర క‌ర్ణాట‌క‌లో ఆయ‌న ప్ర‌చారం చేస్తార‌ని, ఈ ప్రాంతంలో కనీసం 18 స్థానాలు గెలవడమే తమ లక్ష్యమని అంటున్నాయి. జేడీఎస్ నేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామికి ప‌వ‌న్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇప్పటికే స్టార్ కంపెయినర్లుగా హీరో నిఖిల్, హీరోయిన్ పూజాగాంధీ పేర్లు ప్రకటించామని, వారు ఉత్తర కర్నాటకలో ప్రచారం చేస్తారని చెప్పారు.

అయితే ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ని బీజేపీకి వ్య‌తిరేకంగా తెలుగు ప్ర‌జ‌లు ఓటు వేయాల‌ని ఇప్ప‌టికే టీడీపీ నేత‌లు పిలుపునిచ్చారు. అదేస‌మ‌యంలో తెలుగు ప్ర‌జ‌లు బీజేపీని ఓడించాల‌ని, కాంగ్రెస్‌ను గెలిపించాల‌ని ఏపీ కాంగ్రెస్ నేత‌లు కోరుతున్నారు. కాంగ్రెస్ త‌రుపున మెగాస్టార్ చిరంజీవి కూడా ప్ర‌చారం చేయ‌నున్నారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇటీవ‌ల బెంగ‌ళూరుకు వెళ్లి జేడీఎస్ నేత‌, మాజీ ప్ర‌ధాని దేవేగౌడ‌, మాజ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామితో ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటుపై భేటీ అనంత‌రం తెలుగు ప్ర‌జ‌లు జేడీఎస్‌కు జై కొట్టాల‌ని పిలుపునిచ్చారు. అయితే జేడీఎస్ చెబుతున్న‌ట్టుగానే ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌చారం చేస్తారా లేదా.. అన్నది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇక్క‌డ మ‌రో విష‌యం ఏమిటంటే… గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ-టీడీపీ కూట‌మిని గెలిపించాల‌ని ఏపీలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌చారం చేశారు. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాలు తెలిసిందే. టీడీపీ, బీజేపీలు ఇచ్చిన దెబ్బ‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో జేడీఎస్ త‌రుపున ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తారా..? అంటే మాత్రం డౌటేన‌ని ప‌లువ‌రు నాయ‌కులు అంటున్నారు. ఎందుకంటే.. క‌ర్ణాట‌క‌లో ఏ పార్టీకి కూడా పూర్తిస్థాయిలో మెజారిటీ వ‌చ్చే అవ‌కాశం లేద‌నీ, హంగ్ ఏర్ప‌డుతుంద‌ని ప్రీపోల్ స‌ర్వేలు చెబుతున్నాయి. జేడీఎస్ కింగ్ మేక‌ర్ పాత్ర పోషిస్తుంద‌ని అంటున్నాయి. ఒక‌వేళ హంగ్ ఏర్ప‌డితే జేడీఎస్ అటు కాంగ్రెస్‌తోగానీ, ఇటు బీజేపీతోగానీ క‌లిసిపోయే అవ‌కాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ని బీజేపీతో జేడీఎస్ క‌లిస్తే ఏపీలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గ్రాఫ్ అమాంతం ప‌డిపోవ‌డం ఖాయ‌మ‌ని ప‌లువ‌రు రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.