ఎన్టీఆర్‌కు పోటీగా మల్టీస్టారర్‌..!       2018-07-02   02:35:43  IST  Raghu V

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత’. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ చిత్రం షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేసి దసరాకు విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. సినిమా టీజర్‌ను ఈనెల చివర్లో లేదా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయాలని దర్శకుడు తీవ్రంగా కృషి చేస్తున్నాడు.

దసరా సీజన్‌లో వరుసగా చిత్రాలు వస్తాయి. అయితే ఇప్పటి వరకు ఎన్టీఆర్‌, ‘అరవింద సమేత’ చిత్రం మాత్రమే ఉంటుందని అంతా భావించారు. కాని తాజాగా దసరా బరిలోకి నాగార్జున మరియు నానిలు కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ రంగంలోకి దిగుతుంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మల్టీస్టారర్‌ చిత్రం ఆగస్టు చివర్లో చిత్రీకరణ పూర్తి చేసుకోబోతుంది. అందుకే ఈ చిత్రంను దసరాకు విడుదల చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందనే అభిప్రాయం చిత్ర యూనిట్‌ సభ్యుల్లో వ్యక్తం అవుతుంది.

నాగార్జున, నానిల మల్టీస్టారర్‌ చిత్రానికి శ్రీరామ్‌ ఆధిత్య దర్శకత్వం వహిస్తుండగా, అశ్వినీదత్‌ నిర్మిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం కోసం సినీ వర్గాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రేక్షకులు కూడా మల్టీస్టారర్‌ అనగానే అంచనాలు పెంచేసుకుని ఎదురు చూస్తున్నారు. నాని, నాగార్జునల కాంబోపై అంతా కూడా నమ్మకంతో ఉన్నారు. తప్పకుండా ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సందడి చేయడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు కూడా నమ్మకంతో ఉన్నారు. అందుకే దసరాకు ఈ చిత్రాన్ని విడుదల చేసి, సొమ్ము చేసుకోవాలని అశ్వినీదత్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు.

మల్టీస్టారర్‌ చిత్రాలు అనగానే భారీ అంచనాలుంటాయి. అంచనాలకు తగ్గకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల చిత్రంపై కూడా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అందుకే అరవింద సమేత చిత్రంతో పోటీకి ఇతర చిత్రాలు కాస్త జంకుతున్నాయి. కాని నాని, నాగ్‌లు మాత్రం దసరాకు ఎన్టీఆర్‌తో ఢీ కొట్టేందుకు సిద్దం అవుతున్నారు. ఈ రెండు చిత్రాల మద్య అయిదు నుండి వారం రోజుల గ్యాప్‌ ఉండేలా విడుదల ప్లాన్‌ చేస్తున్నారు. రెండు చిత్రాల నిర్మాతలు మాట్లాడుతున్నట్లుగా సమాచారం అందుతుంది.