భారత సంతతికి చెందిన పరిశోధకుడు విక్రమ్ పటేల్( Vikram Patel ) అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ మెడికల్ స్కూల్ అనుబంధ ‘‘ గ్లోబల్ హెల్త్ అండ్ సోషల్ మెడిసిన్’’( Global Health and Social Medicine ) విభాగానికి కొత్త చైర్‌గా ఎంపికయ్యారు.ముంబైలో జన్మించిన ఆయన.
హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లోని బ్లావత్నిక్ ఇన్‌స్టిట్యూట్‌లో గ్లోబల్ హెల్త్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.విక్రమ్ నియామకంపై గత వారం అధికారిక ప్రకటన వెలువడింది.
ఈ ఏడాది సెప్టెంబర్ 1న విక్రమ్ బాధ్యతలు స్వీకరించనున్నారు.తన జీవితంలో మానసిక ఆరోగ్య సమస్యలు, సామాజిక ప్రతికూలతలు వంటి వాటికి చికిత్సను అందించడంపై ఆయన ఎన్నో పరిశోధనలు చేశారు.
గ్లోబల్ హెల్త్ అండ్ సోషల్ మెడిసిన్ విభాగానికి చైర్‌గా వున్న పాల్ ఫార్మర్ గతేడాది ఫిబ్రవరిలో మరణించడంతో విక్రమ్‌ను ఈ పదవికి ఎంపిక చేశారు.ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మానసిక ఆరోగ్య సంక్షోభంపై అవగాహన పెరుగుతున్న సమయంలో విక్రమ్ పటేల్ నియామకం జరిగింది.
ఇకపోతే.1964 మే 5న ముంబైలో జన్మించారు విక్రమ్ పటేల్.ఆయన పూర్తి పేరు విక్రమ్ హర్షద్ పటేల్.బాంబే యూనివర్సిటీలో 1987లో బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ డిగ్రీని పొందిన ఆయన అనంతర కాలంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ లండన్ ( Oxford University, University of London )వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించారు.1997లో మెంటల్ డిజార్డర్స్‌పై పీహెచ్‌డీ అందుకున్నారు.వృత్తి జీవితంలో ఎపిడెమియాలజీ, మెడిసిన్, సైకాలజీ, న్యూరో డిజార్డర్స్, పబ్లిక్ హెల్త్ వంటి విభాగాల్లో పలు హోదాల్లో పనిచేశారు.
అమెరికాలో స్థిరపడినప్పటికీ.మాతృభూమికి కూడా ఆయన సేవలు అందిస్తున్నారు.ప్రస్తుతం విక్రమ్ పటేల్ భారత ప్రభుత్వం నియమించిన నాలుగు కమిటీల్లో పనిచేస్తున్నారు.అవి మెంటల్ హెల్త్ పాలసీ గ్రూప్, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఆశా మెంటారింగ్ గ్రూప్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ కోర్ కమిటీ ఆన్ హెల్త్, టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ రాష్ట్రీయ కిశోర్ స్వస్థీయ కార్యక్రమం.వైద్య రంగంలో చేసిన కృషికి గాను పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు విక్రమ్‌ను వరించాయి.2015లో ప్రపంచంలోనే 100 మంది అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల్లో ఒకరిగా ఆయనను టైమ్ మేగజైన్ ప్రకటించింది.అదే ఏడాది జార్జ్‌టౌన్ యూనివర్సిటీ విక్రమ్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది.