చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఇలా రంగం ఏదైనా సరే.ప్రపంచంలోని ఎన్నో దేశాల యువత డెస్టినేషన్ అమెరికా.
నాణ్యతతో కూడిన విద్య, మంచి ఉపాధి మార్గాలు, మెరుగైన జీవన విధానాలతో అగ్రరాజ్యం ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.అందుకే కోట్లాది మంది యువత అమెరికా వెళ్లాలని కలలు కంటారు.
భారతీయులు ఈ విషయంలో ముందున్నారు.కేంద్ర ప్రభుత్వం కృషి, ప్రవాసీ సంఘాల తోడ్పాటు కారణంగా భారతీయులు అమెరికాలో చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఇతర భారతీయ నగరాలతో పోలీస్తే హైదరాబాద్ అత్యధిక మంది విద్యార్ధులను అమెరికాకు పంపినట్లు గణాంకాలు చెబుతున్నాయి.దేశ రాజధాని ఢిల్లీ, ఆర్ధిక రాజధాని ముంబైలను కూడా ఈ విషయంలో భాగ్యనగరం వెనక్కి పంపింది.2021-22లలో అమెరికాలో యూనివర్సిటీలలో చదువుకునేందుకు 2.61 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్ధులు రిజిస్టర్ చేసుకున్నారు.వీరిలో 75000 మంది భారతీయ విద్యార్థులేనని ఓపెన్ డోర్స్ నివేదిక పేర్కొంది.వీరిలో 30 శాతం మంది హైదరాబాద్‌కు చెందినవారే కావడం గమనార్హం.
గతేడాదితో పోలిస్తే 2022లో అమెరికన్ యూనివర్సిటీల్లో భారతీయ విద్యార్ధుల సంఖ్య 19 శాతం పెరిగిందని, పది లక్షల మంది విదేశీ విద్యార్ధుల్లో 21 శాతం మంది భారతీయ విద్యార్ధులేనని నివేదిక పేర్కొంది.2020-21లో 1,67,582 మంది భారతీయ విద్యార్ధులు అమెరికా వెళ్తే.2021-22లో ఈ సంఖ్య 1,99,182కి చేరుకుంది.మరోవైపు.
కఠినమైన కోవిడ్ నిబంధనలు, ప్రయాణ పరిమితుల కారణంగా చైనా విద్యార్ధులకు అమెరికా వీసా దొరకడం కష్టమవ్వడంతో.భారత్ కంటే చైనా విద్యార్ధులు వెనుకబడిపోయారు.2022-23లో అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్ధుల సంఖ్య చైనాను అధిగమించే అవకాశం వుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్ధుల్లో 19 శాతం పెరుగుదల నమోదవ్వడానికి కారణం గ్రాడ్యుయేట్లేనని నిపుణులు చెబుతున్నారు.వీరిలో ఎక్కువ మంది మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, బిజినెస్, మేనేజ్‌మెంట్‌లను ఎంచుకుంటున్నారు.అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న మొత్తం అంతర్జాతీయ విద్యార్ధుల సంఖ్య 2020-21లో 9.14 లక్షల నుంచి 2021-22 నాటికి 9.48 లక్షలకు పెరిగింది.