మన దేశంలో ఎన్నో పురాతన ఆలయాలు. ప్రసిద్ధి చెందిన ఆలయాలు కొలువై ఉన్నాయి.
ఈ విధంగా కొలువై ఉన్న ఆలయాలలో ఎన్నో వింతలు, రహస్యాలు దాగి ఉన్నాయి.ఇప్పటికీ ఆ రహస్యాలు వెనుక కారణాలను నిపుణులు చేదించలేకపోతున్నారు.
ఈ విధంగా ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించే ఆలయాలలో గంట ఆలయం ఒకటి.వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు, రహస్యాలు దాగి ఉన్నాయి.
మరి ఈ గంట ఆలయం విశిష్టతలు, విశేషాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా, సంతరావురు అనే గ్రామంలో పార్వతీ సమేతంగా శ్రీ రామలింగేశ్వర స్వామి కొలువై ఉండి భక్తులను దర్శనమిస్తున్నారు.
ఇక్కడ ఆలయంలో వెలసిన స్వామివారు స్వయంభువుగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి.సాధారణంగా ఏ ఆలయంలోనైనా శివలింగానికి ఎదురుగా మనకు ఒక నంది మాత్రమే దర్శనం ఇస్తుంది.కానీ అన్ని ఆలయాల కంటే ఈ ఆలయం ఎంతో భిన్నమైనది.ఈ ఆలయంలో స్వామివారి లింగానికి ఎదురుగా రెండు నందులు దర్శనమిస్తాయి.
అదేవిధంగా గర్భగుడిలో స్వామివారికి ఎదురుగా వెలిగించిన దీపాన్ని ఈ రెండు నందులు చూసే విధంగా ఆలయ నిర్మాణాన్ని ఎంతో అద్భుతంగా చేపట్టారు.
ముఖ్యంగా ఈ ఆలయం గురించి చెప్పుకోవాల్సిన విషయానికి వస్తే ఈ ఆలయంలో ఉన్నటువంటి గంట ఎంతో ప్రత్యేకమైనది.

మనం ఏదైనా ఆలయాలకు వెళ్ళినప్పుడు ఒకసారి గంట మోగిస్తే మనకు రెండు మూడు సార్లు ఆ గంట ప్రతిధ్వని వినిపిస్తుంది.కానీ ఈ రామలింగేశ్వర స్వామి ఆలయంలోనికి వెళ్లి ఒక్కసారి గంట మోగిస్తే 108 సార్లు ప్రతిధ్వనిస్తుంది. ఎంతో విశిష్టత కలిగిన ఈ గంట నుంచి మనం ఓంకారం శబ్దాన్ని స్పష్టంగా వినవచ్చు.ఈ విధంగా గంటనుంచి ఓం కారం శబ్దం కాశీ విశ్వనాధుని ఆలయంలో వినవచ్చు.
ఆ తరువాత ఈ రామలింగేశ్వరాలయంలో మాత్రమే ఓంకార శబ్దాన్ని వినగలము.ఈ విధంగా ఈ ఆలయంలో ఎన్నో విశిష్టతలు దాగి ఉన్నాయి.
ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ ఆలయానికి భక్తులు కార్తీకమాసం, శివరాత్రి, మాఘమాసం వంటి నెలలో పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రత్యేక పూజలలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారు.