అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని ఓ స్కూల్‌లో ఉన్మాది జరిపిన కాల్పుల ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అమెరికాలోని గన్ కల్చర్‌పై మరోసారి చర్చ జరుగుతోంది.
అక్కడి డెమొక్రాట్లు తుపాకుల వాడకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే.రిపబ్లికన్లు మాత్రం గన్ లాబీకి మద్ధతుగా నిలుస్తున్నారు.
ఈ క్రమంలో అమెరికాకు పొరుగున వున్న కెనడా సైతం గన్ కల్చర్‌పై దృష్టి సారించింది.
దీనిలో భాగంగా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం సోమవారం పార్లమెంట్‌లో ఒక చట్టాన్ని ప్రవేశపెట్టింది.
ఇది హ్యాండ్‌గన్స్‌ను దిగుమతి చేసుకోవడం, కొనుగోలు చేయడం లేదా విక్రయించడాన్ని స్తంభింపజేస్తుంది.ఈ చట్టంపై చర్చ సందర్భంగా ప్రధాని ట్రూడో ఉద్వేగంగా ప్రసంగించారు.తాము కెనడాలో తుపాకుల సంఖ్యను పరిమితం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.వ్యక్తిగత తుపాకుల సంఖ్యను నిరోధించేలా ఈ చట్టంలో నిబంధనలు తోడ్పడతాయని నిపుణులు భావిస్తున్నారు.
ఇకపై కెనడాలో హ్యాండ్‌గన్స్‌ని కొనుగోలు చేయడం, విక్రయించడం, బదిలీ చేయడం, దిగుమతి చేసుకోవడం చట్ట విరుద్ధమని ట్రూడో స్పష్టం చేశారు.ట్రూడో ప్రభుత్వం ఇప్పటికే 1,500 రకాల సైనిక శైలి తుపాకులను నిషేధించేందుకు ప్రణాళికలను రూపొందించింది.ఈ ఏడాది చివరిలో తప్పనిసరిగా బైబ్యాక్ ప్రోగ్రామ్‌ను అమలు చేయనుంది.ప్రధాని ట్రూడో కఠినమైన తుపాకీ చట్టాలను అమలు చేయాలని గట్టి పట్టుదలతో వున్నారు.అయితే ఈ నెలలో అమెరికాలోని టెక్సాస్, బఫెలో లో జరిగిన నరమేధం నేపథ్యంలో ఆయన హ్యాండ్‌గన్స్‌ని నియంత్రించే చట్టాన్ని ప్రవేశపెట్టారు.అమెరికాతో పోల్చితే కెనడా చాలా భిన్నంగా వుంటుందని ఆ దేశ మంత్రి బిల్ బ్లెయిర్ పేర్కొన్నారు.
కెనడాలో తుపాకుల్ని వేట, క్రీడా ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తారని ఆయన స్పష్టం చేశారు.తుపాకీలను సులభంగా యాక్సిస్ చేసే వీలు లేకపోవడం వల్ల అమెరికాతో పోలిస్తే కెనడాలో సామూహిక కాల్పుల ఘటనలు స్వల్పంగానే నమోదవుతాయని బిల్ బ్లెయిర్ గుర్తుచేశారు.
అమెరికా నుంచి తుపాకులు చట్ట విరుద్ధంగా కెనడాలోకి అక్రమంగా రవాణా చేస్తున్నారని మంత్రి వెల్లడించారు
.