తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం , కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ,కొత్త సమీకరణాలు మొదలయ్యాయి.బీఆర్ఎస్ లోని అసంతృప్తి నేతలతో పాటు , కిందిస్థాయి క్యాడర్ కాంగ్రెస్ లో చేరేందుకు మొగ్గు చూపిస్తున్నారు.
కాంగ్రెస్ నాయకుల నుంచి ఆహ్వానాలు అందుతూ ఉండడంతో ,గ్రామస్థాయి నాయకులు నుంచి , రాష్ట్ర స్థాయి నాయకులు వరకు అనేకమంది పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనే విషయాన్ని బీఆర్ఎస్ అధిష్టానం గుర్తించింది. సహజంగానే అధికార పార్టీలో చేరేందుకు ఇతర నాయకులు మొగ్గు చూపిస్తుంటారు.
అయితే ఈ చేరుకులు భారీగా ఉంటే జరిగే నష్టం తీవ్రంగా ఉంటుందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది .దీనికి తోడు మరికొద్ది నెలలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు , పార్లమెంట్ ఎన్నికలు ఉండడంతో , ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి తమ పట్టు నిరూపించుకోవాలంటే కేడర్ చెక్కుచెదరకుండా చూసుకోవడం ఒకటే మార్గం అని బీఆర్ఎస్ అధిష్టానం గుర్తించింది.
అందుకే కిందిస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలు ఎవరు పార్టీ వీడకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది.వారికి విజ్ఞప్తులు చేస్తూ, పార్టీ కి మళ్ళీ పునర్వైభవం వస్తుందని, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారం తమదేనా అని, స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుకుందామనే వర్తమానాలు పంపుతూ సోషల్ మీడియా ద్వారానూ వారికి విజ్ఞప్తులు చేస్తోంది.
ఎక్కడెక్కడ అసంతృప్తులు ఉన్నారు. ఎవరెవరు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారో గుర్తించి బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టింది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై కేడర్ అసంతృప్తిగా ఉండడం ,కనీసం వారిని పలకరించేందుకు ఇష్టపడకపోవడం, వారి సమస్యలను వినేందుకు తీరికలేదు అన్నట్లుగా వ్యవహరించడం తదితర కారణాలతో అసంతృప్తితో ఉండడంతో, ఎన్నికల్లో జరిగిన నష్టం తీవ్రంగా ఉందని, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని క్యాడర్ చెల్లా చెదురు కాకుండా , పార్టీని అడ్డుపెట్టుకుని ఉండే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టేందుకు బీఆర్ఎస్ అధిష్టానం వ్యూహాలు రచిస్తూనే క్యాడర్ ను బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది.