వైద్య ఆరోగ్యశాఖ సంచాలకులు ఆర్వీ కర్ణన్ *ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యధిక ప్రసవాలు జరిగేలా కార్యాచరణ *ఆసుపత్రుల వద్ద మందుల కొరత రాకుండా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి *సిరిసిల్ల వైద్య ఆరోగ్య శాఖ పై రివ్యూ నిర్వహించిన ఆరోగ్యశాఖ సంచాలకులు రాజన్న సిరిసిల్ల( rajanna sircilla ) జిల్లా పరిధిలోని ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్యం అందేలా పటిష్ట కార్యాచరణను అమలు చేయాలని ఆరోగ్యశాఖ సంచాలకులు ఆర్వీ కర్ణన్ అన్నారు.శుక్రవారం ఆరోగ్యశాఖ సంచాలకులు ఆర్వీ కర్ణన్ రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, అదనపు కలెక్టర్లతో కలిసి సిరిసిల్ల వైద్య ఆరోగ్య శాఖ పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో జరుగుతున్న ప్రసవాల సంఖ్య, సీజనల్ వ్యాధులు, ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, వైద్య కళాశాల, తెలంగాణ డయాగ్నస్టిక్ సేవలు , ప్రభుత్వ ఆసుపత్రులలో మందుల లభ్యత తదితర వివరాలను సంచాలకులు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ సంచాలకులు ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యధికంగా ప్రసవాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, అత్యవసరమైన పక్షంలోనే సి సెక్షన్ ఆపరేషన్లు నిర్వహించాలని అన్నారు.సి సెక్షన్ ఆపరేషన్లను నియంత్రించడంలో గతంతో పోలిస్తే ఇప్పుడు సిరిసిల్ల జిల్లా మంచి పురోగతి సాధించిందని, ఇదే విధానంతో ముందుకు పోవాలని అన్నారు.అధికంగా సి సెక్షన్ ఆపరేషన్లు ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేసి ఆడిట్ నిర్వహించాలని సంచాలకులు అధికారులను ఆదేశించారు
జిల్లాలో నూతన ఆసుపత్రుల ఏర్పాటుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మాత్రమే జరగాలని అన్నారు.పి.సి.ఎన్.బీ యాక్ట్(PCNB Act) అమలు జిల్లాలో కట్టుదిట్టంగా నిర్వహించాలని, నూతన స్కానింగ్ సెంటర్లు, పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు కమిషనర్ అనుమతి తప్పనిసరని అన్నారు.జిల్లాలోని స్కానింగ్ కేంద్రాల పనితీరు నిరంతరం పర్యవేక్షించాలని, ఆడపిల్లలు బ్రుణ హత్యలు జర్గకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పి.సి.ఎన్.బి యాక్ట్ అమ్మలకు సంబంధించి ఎప్పటికప్పుడు జిల్లా అడ్వైజర్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని అన్నారు.జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద మందుల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి వ్యాధికి సంబంధించి అవసరమైన మందులు పూర్తి స్థాయిలో ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయని , జిల్లాలకు కేటాయించే డ్రగ్స్ అవసరమైన ఆసుపత్రుల వద్ద అందుబాటులో ఉండేలాగా చర్యలు తీసుకోవాలని అన్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద అందుబాటులో ఉన్న డ్రగ్స్ వివరాలపై వైద్యులు అవగాహన కలిగి ఉండాలని, అందుబాటులో ఉన్న డ్రగ్స్ ను మాత్రమే రోగులకు ప్రిస్క్రైబ్ చేయాలని, రోగులు అనవసరంగా బయట ప్రైవేటుగా మందులు కొనాల్సిన అవసరం రావద్దని సంచాలకులు తెలిపారు.
డ్రగ్స్ స్టాక్ వివరాలు కట్టుదిట్టంగా నిర్వహించాలని సంచాలకులు అధికారులను ఆదేశించారు.
జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నస్టిక్స్(Telangana Diagnostics) సేవల వివరాలను తెలుసుకున్నారు.
ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి శాంపిల్స్ సేకరించి డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా పరీక్షలు నిర్వహించాలని అన్నారు.రేడియాలజీ విభాగానికి సంబంధించి కూడా పరీక్షల నివేదికలు ఎప్పటికప్పుడు అందజేయాలని అన్నారు.
ప్రతి ల్యాబ్ టెక్నీషియన్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటూ అవసరమైన సేవలు సమర్థవంతంగా అందించేలా చూడాలని అన్నారు.సిరిసిల్ల జిల్లాలోని(Sirisilla district) వైద్య కళాశాల, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మంజూరైన స్టాఫ్, ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్టాఫ్ , ఖాళీలు మొదల వివరాలను తెలుసుకున్నారు.
వైద్య కళాశాల, అనుబంధ ఆసుపత్రి నిర్మాణ పనులు 2 సంవత్సరాల కాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
సిరిసిల్ల జిల్లాలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకున్న చర్యలను సంచాలకులు పరిశీలించారు.
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ఔట్ పేషెంట్ లను నిశ్చితంగా పరిశీలించి వారికి అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు.సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన సంచాలకులు, అప్రమత్తత కొనసాగించాలని అధికారులకు తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వసంత రావు, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, మెడికల్ సూపరింటెండెంట్లు లక్ష్మీనారాయణ, పెంచలయ్య, డిప్యూటీ సూపరింటెండెంట్ సంతోష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.