ఉమ్మడి తెలుగు రాష్ర్టంలో రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి కాంగ్రెసును అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించిన ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్, మంత్రిగా పనిచేసిన నిజామాబాద్ నేత హోదా లేదా స్థాయి ఇప్పుడు పెరిగిందా? తగ్గిందా? ఆయన ప్రస్తుతం టీఆర్ఎస్ నాయకుడనే సంగతి తెలిసిందే.కాంగ్రెసు ఓడిపోయిన పార్టీ కాబట్టి అందులో ఆయనకు పదవి లేదు.ఏదో ఒక పదవి లేకపోతే చికాకుగా ఉంటుంది.‘కలాపోసన లేందే మణిసికి, గొడ్డుకీ తేడా ఏంటుంటది’…అన్నట్లుగా పదవి లేకపోతే రాజకీయ నాయకుడికీ, మామూలు మనిషికీ తేడా ఏముంటుంది? డీఎస్ పైకి ఎన్ని కారణాలు చెప్పినా పదవి కోసమే టీఆర్ఎస్ చేరారనే విమర్శలు వచ్చాయి.ఇక్కడ పదవి అంటే మంత్రి పదవి అని అర్థం.అది వస్తుందనే ఉద్దేశంతోనే ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు.కాని అనుకున్న పదవి రాలేదు.పదవి ఇస్తానని పార్టీలో చేర్చుకున్న తరువాత ఖాళీగా ఉంచితే బాగుండదు కదా.అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ఆలోచించి ‘సలహాదారు’ అనే పదవి ఇచ్చారు.శుక్రవారం డీఎస్ ఆ బాధ్యత స్వీకరించారు.
కొత్త బాధ్యతను విజయవంతంగా నిర్వహించాలని టీఆర్ఎస్ నాయకులు ఆకాంక్షిస్తూ ఘన స్వాగతం పలికారు.డీఎస్‌కు నెలకు లక్ష రూపాయల జీతం చెల్లిస్తూ, ఇతర సౌకర్యాలూ కల్పిస్తారు.
ఇది ‘కేబినెట్ హోదా’ ఉన్న పదవి అని చెబుతున్నారు.కేబినెట్ మంత్రి పదవి ఇవ్వకపోయినా దాంతో సమానమైన హోదా ఇచ్చారని డీఎస్ సంతోషపడుతున్నారు.
ఈయన సీఎం కేసీఆర్‌కు ఏం సలహాలు ఇస్తారో తెలియదు.ఈయన ఇచ్చిన సలహాలు కేసీఆర్ పాటిస్తారా? తెలియదు.కొందరు నాయకులకు ‘ఉపాధి’ కల్పించేందుకు సలహాదారులనే పోస్టులు సృష్టిస్తారు.వీరి సలహాలు ముఖ్యమంత్రి పాటించాలనే రూలు లేదు.కేసీఆర్ వంటి వ్యక్తులు సలహాదారుల సలహాలు పాటిస్తారని అనుకోవడం భ్రమే.