తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుందన్నట్లుగా సినిమా హీరోకు అవకాశాలు లేకపోతే రాజకీయ నాయకుడవుతాడు.అయితే ఇలాంటివారు సినిమా అవకాశాలు లేక రాజకీయాల్లోకి వచ్చామని చెప్పుకోరు.
ప్రజలకు సేవ చేయడానికి పాలిటిక్సులోకి దిగామంటారు.ఒకప్పటి లోబడ్జెటు సినిమాల హీరో శివాజీ ప్రస్తుతం రాజకీయ నాయకుడైపోయాడు.సినిమాలకు లేక లీడరైపోయాడా? లీడర్ అవడం కోసమే రాజకీయాల్లోకి వచ్చాడా? చెప్పలేం.‘సంబరాల రాంబాబు శ్రీమంతుడయ్యాడు’ అన్నట్లు శివాజీ లీడరైపోయాడు అని చెప్పుకోవాలి.రాజకీయాలను సీరియస్‌గా తీసుకొని పూర్తి సమయం కేటాయిస్తే భవిష్యత్తులో రాణించవచ్చేమో.ఏపీకి చెందిన శివాజీ ఆ రాష్ర్టానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ కొంతకాలం క్రితం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి నాలుగు రోజులు హడావిడి చేశాడు.
ఇలాంటి దీక్షలను ప్రభుత్వం కొనసాగనివ్వదని, ఎత్తేసి ఆస్పత్రిలో పడేస్తారని తెలిసిన సంగతే కదా.శివాజీ విషయంలోనూ ఇదే జరిగింది.శివాజీ నిరాహార దీక్ష చేయడం టీడీపీ కంటే భాజపాకు ఎక్కువ కోపం తెప్పించింది.ఎందుకంటే శివాజీ ఆ పార్టీ సభ్యుడు.అయినప్పటికీ ప్రత్యేక హోదా ఇవ్వకుండా జాప్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాడు.దీంతో భాజపా నాయకులు కూడా ఇతన్ని నానా మాటలూ అన్నారు.
ఈ అధ్యాయం ముగిశాక తాజాగా ఈయన ‘ఏపీ ప్రత్యేక హోదా కమిటీ’కి అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.స్పెషల్ స్టేటస్ కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం కోసం కొందరు కలిసి ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ ఈ కమిటీకి గౌరవ అధ్యక్షుడయ్యారు.మాల మహానాడు కన్వీనర్ కారెం శివాజీ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాలను బ్రహ్మాండంగా నిర్వహించడంలో చూపిన శ్రద్ధ ప్రత్యేక హోదా సాధించడంలో చూపడంలేదని శివాజీ విమర్శించారు.జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హోదా సాధన కోసం కృషి చేయాలని, ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
కొంతకాలం కిందట హీరోగా నటించిన ‘బూచమ్మ…బూచాడు’ సినిమా తరువాత శివాజీకి సినిమాలు లేకుండా పోయాయి.ఆ సినిమా హిట్టయినట్లు ఆయన చెప్పుకున్నా, సినిమాల్లో ఆయన మాత్రం హిట్ కాలేదు.
మరి రాజకీయాల్లో హిట్ అవుతాడా?