ఫిన్లాండ్‌లోని లాప్‌ల్యాండ్(Lapland , Finland) నుంచి హెల్సింకికి (Helsinki)ప్రయాణిస్తున్న గోకుల్ శ్రీధర్(Gokul Sridhar) అనే వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది.ప్రశాంతంగా సాగుతున్న తన రైలు ప్రయాణంలో, ఒక భారతీయ కుటుంబం చేసిన పనికి ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు.
ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదిక X (గతంలో ట్విట్టర్) ద్వారా అందరితో పంచుకున్నారు.గోకుల్ చెప్పిన వివరాల ప్రకారం, రైలు బోగీ అత్యంత నిశ్శబ్దంగా ఉంది.
ప్రయాణికులందరూ తమ ప్రయాణాన్ని నిశ్శబ్దంగా ఆస్వాదిస్తున్నారు.
అయితే, ఒక భారతీయ కుటుంబం మాత్రం దీనికి పూర్తి భిన్నంగా వ్యవహరించింది.
వారు క్యాబిన్ తలుపులు తెరిచి, హిందీలో బిగ్గరగా వీడియో కాల్‌లో ముచ్చట్లు పెడుతూ, తోటి ప్రయాణికుల ప్రశాంతతకు భంగం కలిగించారు.ఈ సంఘటనపై గోకుల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, “లాప్‌ల్యాండ్ నుంచి హెల్సింకికి రైలులో ప్రయాణిస్తున్నాను.
ఈ సైలెంట్ ట్రైన్ కోచ్‌లో ఒక కుటుంబం మాత్రమే చాలా బిగ్గరగా మాట్లాడుతోంది.వారు క్యాబిన్ తలుపులు తెరిచి హిందీలో వీడియో కాల్‌లో మాట్లాడుతున్నారు.భారతీయులమైన మనం పౌర స్పృహను నిజంగా అర్థం చేసుకోలేం.” అని ట్వీట్ చేశారు.
ఇంతేకాదు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఎలా మర్యాదగా ఉండాలో తెలిపే ఒక వీడియోను తాను కొద్దిసేపటి క్రితమే చూశానని, దానికి పూర్తి విరుద్ధంగా ఈ ఘటన జరిగిందని గోకుల్ ఆవేదన వ్యక్తం చేశారు.టోక్యో వంటి నగరాల్లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ఫోన్‌లో మాట్లాడటం ఎంత అసభ్యకరమైన చర్యగా పరిగణిస్తారో ఆయన గుర్తు చేశారు.
గోకుల్ శ్రీధర్ చేసిన ట్వీట్‌కు ఎక్స్‌లో ఊహించని స్పందన లభించింది.చాలా మంది నెటిజన్లు ఇలాంటి అనుభవాలను పంచుకుంటూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.“నిశ్శబ్దంగా ఉండాల్సిన రైలు బోగీలో ఫోన్లో బిగ్గరగా మాట్లాడేవాళ్లు ఎప్పుడూ ఉంటారు” అంటూ ఒక యూజర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.మరొక యూజర్ లండన్‌లో కూడా ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతుంటాయని, ఇది దేశం పట్ల చెడు అభిప్రాయానికి దారితీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, కొన్ని కామెంట్లు హద్దులు దాటాయి.“భారతీయులు అంతరిక్షంలో ఎన్నో విజయాలు సాధించినప్పటికీ, వారి ప్రవర్తన మాత్రం మారదు” అంటూ కొందరు తీవ్ర విమర్శలు చేశారు.ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారానికి దారితీశాయి.ఒక్కొక్క సంస్కృతిలో ఒక్కో రకమైన ప్రవర్తన ఉంటుందనే వాదన ఉన్నప్పటికీ, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండటం కనీస ధర్మం అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.