కెనడాలో( Canada ) తన బిడ్డ దుండగుల దాడిలో మరణించాడని తెలుసుకున్న తల్లి.కొడుకు లేకుండా జీవించలేనంటూ బలవన్మరణానికి పాల్పడింది.
వివరాల్లోకి వెళితే.పంజాబ్‌కు చెందిన గుర్విందర్ నాథ్ ( Gurvinder Nath )అనే విద్యార్ధి సొంత వ్యాపారం ప్రారంభించాలనే లక్ష్యంతో 2021 జూలైలో కెనడా వెళ్లాడు.
ఒంటారియో ప్రావిన్స్‌లోని ఓ ఫుడ్ డెలివరీ సంస్థలో భాగస్వామిగా చేరాడు.ఈ క్రమంలో జూలై 9న తెల్లవారుజామున 2.10 గంటల సమయంలో డెలివరీ కోసం క్రెడిట్ వ్యూ రోడ్డులో ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని దుండగులు గుర్విందర్‌ను అడ్డుకున్నారు.అనంతరం అతనిపై దాడి చేసి వాహనాన్ని దొంగిలించుకుపోయారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన గుర్విందర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 14న తుదిశ్వాస విడిచాడు.
జీవితంలో గొప్పస్థాయికి చేరుకుంటాడనుకున్న కొడుకు తిరిగిరాని లోకాలకు తరలిపోయాడని తెలుసుకున్న అతని తల్లి శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది.
రోజుల వ్యవధిలో తల్లికొడుకులు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో , గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.గుర్విందర్ స్వగ్రామం పంజాబ్‌లోని నవన్‌షహర్ ( Nawanshahr in Punjab )జిల్లా కరీంపూర్ చహ్వాలా.
నిజానికి దుండగుల దాడిలో తమ బిడ్డ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని మాత్రమే గుర్విందర్ తల్లి నరీందర్ కౌర్‌కు తెలుసు.కానీ అతను మరణించిన సంగతి మాత్రం తెలియదు.
గుర్విందర్ భౌతికకాయాన్ని కెనడా నుంచి శుక్రవారం భారత్‌కు రానుంది.ఈ లోగా కొడుకు మరణవార్త తెలుసుకున్న నరీందర్ తట్టుకోలేకపోయింది.కుమారుడిని కడసారి చూడకుండానే విషం తాగి ఆత్మహత్య చేసుకుంది.పక్కపక్కనే తల్లిబిడ్డల మృతదేహాలు వుండటం చూసిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కంటతడి పెడుతున్నారు.గుర్విందర్, నరీందర్ అంత్యక్రియలు ఈరోజు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు.
కాగా.నాథ్ స్నేహితుడు జస్వీందర్ మీలు( Jaswinder Meelu ) మాట్లాడుతూ.గుర్విందర్ హత్య తమను షాక్‌కు గురిచేసిందన్నారు.
పీల్ రీజినల్ పోలీసులు విచారణ ప్రారంభించారని, పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లుగా జస్వీందర్ పేర్కొన్నారు.నిందితులు ఉపయోగించిన వాహనాన్ని కూడా పోలీసులు గుర్తించారు.
నాథ్ కుటుంబానికి అండగా నిలిచేందుకు గాను అతని బంధువు బలరామ్ క్రిషన్ ఆన్‌లైన్‌లో నిధుల సేకరణను ప్రారంభించారు.గత శుక్రవారం సాయంత్రం నాటికి దాదాపు 97,000 కెనడా డాలర్లు సమకూరాయి.