అమెరికాలో భారతీయులు పలు హోదాల్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే.మొన్నామధ్యన సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌కు సీఈవోగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు.
తద్వారా ఇప్పటికే అమెరికాలోని దిగ్గజ సంస్థలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, మాస్టర్ కార్డ్, ఐబీఎం వంటి సంస్థలకు సారథ్యం వహిస్తున్న భారతీయుల కోవలోకి పరాగ్ చేరారు.ఆ తర్వాత కూడా మరెన్నో సంస్థలకు సారథులుగా భారతీయులు నియమితులవుతున్నారు.
తాజాగా భారత సంతతికి చెందిన డాక్టర్ గగన్ పవార్ అమెరికాలోని ఓ ప్రముఖ హెల్త్ కేర్ ఏజెన్సీకి సీఈవోగా నియమితులయ్యారు.41 ఏళ్ల గగన్ పవార్ స్వస్థలం పంజాబ్ రాష్ట్రం జలంధర్ నగర శివార్లలోని మిథాపూర్ గ్రామం.ఈమె తండ్రి సరబ్‌జిత్ సింగ్ పవార్ ఆర్మీలో మేజర్ జనరల్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు.దక్షిణ కాలిఫోర్నియా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న Clinicas del Camino Real Inc సీఈవోగా తన కుమార్తె గగన్ పవార్ నియమితులైనట్లు సరబ్‌జిత్ సింగ్ మీడియాకు తెలిపారు.16 క్లినిక్‌లు, 70 మంది వైద్యుల సహా మొత్తం 900 మంది ఉద్యోగులతో ఆ సంస్థ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఆయన చెప్పారు.
గగన్ పవార్ అమృత్‌సర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు.అనంతరం పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఎండీ చేశారు.తర్వాత 2011లో Clinicas del Camino Real Incలో ఫిజీషియన్‌గా చేరిన గగన్ పవార్ 2014లో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు.
ఇప్పుడు అదే కంపెనీకి సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని చెప్పారు.విధుల్లో క్షణం తీరిక లేకుండా వున్నప్పటికీ ఎంబీఏ ఫిజీషియన్ కూడా చేశారు.వెంచురా కౌంటీ మెడికల్ అసోసియేషన్‌లో డాక్టర్ గగన్ పవార్ సభ్యురాలు.కరోనా మహమ్మారి సమయంలో ఆమె చేసిన సేవలకు పలువురి ప్రశంసలు దక్కాయి.
తన భర్త ఇద్దరు కుమారులతో గగన్ పవార్ అమెరికాలోనే స్థిరపడ్డారు.తాను ఈ స్థాయికి చేరుకోవడం వెనుక తన కుటుంబం మద్ధతు వుందని ఆమె తెలిపారు.
—