వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు అక్కడ అత్యున్నత పదవులను అధిరోహిస్తున్న సంగతి తెలిసిందే.అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూకే, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో భారతీయులు కీలక హోదాల్లో వున్నారు.
ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక స్కాట్‌లాండ్ యార్డ్ పోలీస్ చీఫ్ పదవి రేసులో భారత సంతతి బ్రిటీష్ పోలీస్ అధికారి నీల్ బసు నిలిచారు.లండన్ మెట్రోపాలిటన్ పోలీస్ కమీషనర్ , స్కాట్‌లాండ్ యార్డ్ చీఫ్ పదవుల నియామకానికి సంబంధించి షార్ట్ లిస్ట్ అయిన వారిలో నీల్ బసు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
అయితే గతంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు యూకే ప్రధాని బోరిస్ జాన్సన్, హోం సెక్రటరీ ప్రీతి పటేల్‌ను తప్పుదారి పట్టించాయనే వాదనలు నీల్ బసుకు ప్రతిబంధకాలుగా మారే అవకాశం వుందని బ్రిటీష్ మీడియా కథనాలను ప్రసారం చేస్తోంది.
లండన్ మేయర్ సాదిక్ ఖాన్ విశ్వాసం కోల్పోవడంతో ప్రస్తుతం నగర పోలీస్ కమీషనర్‌గా వున్న క్రెసిడా డిక్ తన పదవికి రాజీనామా చేశారు.
దీంతో లండన్ పోలీస్ కమీషనర్ పదవి గురువారం ఖాళీ అయ్యింది.భారత్‌లోని కోల్‌కతాకు చెందిన వైద్యుడికి, వేల్స్ తల్లికి జన్మించారు నీల్ బసు.ప్రస్తుతం స్కాట్‌లాండ్ యార్డ్ పోలీస్ విభాగంలో అసిస్టెంట్ ర్యాంక్ హోదాలో వున్నారు.తన కృషి, పట్టుదలతో ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు.
నాటింగ్‌హామ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నీల్ బసు.1992లో మెట్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో చేరారు.కాలేజ్ ఆఫ్ పోలీసింగ్ డైరెక్టర్‌గా, ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలకు చీఫ్‌గాను వ్యవహరించారు.బ్రిటీష్ అధికార పార్టీకి చెందిన ‘‘ ది మెయిల్ ఆన్ సండే’’ కథనం ప్రకారం… యూకే గూఢచార సంస్థ ఎంఐ5 అత్యున్నత అధికారులకు నీల్ బసు ప్రొఫైల్ బాగా నచ్చిందని తెలిపింది.
ఒకవేళ లండన్ పోలీస్ కమీషనర్‌గా ఆయన నియామకం ఖరారైతే.ఈ పదవిని అందుకున్న తొలి శ్వేతజాతీయేతర, మైనారిటీ వ్యక్తిగా నీల్ బసు రికార్డుల్లోకెక్కుతాడని ది గార్డియన్ కథనాన్ని ప్రచురించింది.
చట్ట ప్రకారం.యూకే హోమ్ సెక్రటరీ, లండన్ మేయర్‌లు ఏకాభిప్రాయంతో నగర పోలీస్ కమీషనర్‌ను ఎన్నుకోవాల్సి వుంటుంది.
అయితే దేశ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను సంప్రదించకుండా ప్రీతి పటేల్ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు.