పద్మశ్రీ అవార్డు గ్రహీత, డోలు వాయిద్యంలో ప్రత్యేక ప్రతిభను కనబరిచిన కళాకారుడు సకిని రామచంద్రయ్య కు తన స్థానిక జిల్లా కేంద్రం కొత్తగూడెం లో నివాస యోగ్యమైన ఇంటి స్థలం, నిర్మాణ ఖర్చుకు రూ.1 కోటి రూపాయల రివార్డును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు.పద్మశ్రీ అవార్డు ను అందుకున్న నేపథ్యంలో సిఎం కేసిఆర్ ను మంగళవారం ప్రగతి భవన్ లో మర్యాద పూర్వకంగా రామచంద్రయ్య కలిసారు.
అంతరించిపోతున్న ఆదివాసీ సాంస్కృతిక కళను బతికిస్తున్నందుకు సిఎం అభినందించారు.తన జీవితకాలపు ప్రతిభకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు ను పొందడం పట్ల సిఎం కేసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రామ చంద్రయ్య యోగ క్షేమాలను సిఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.ఇంటి జాగ, నిర్మాణానికి సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును సిఎం ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రులు హరీశ్ రావు, సత్యవతి రాథోడ్, మహమూద్ అలి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, తక్కెళ్ల పల్లి రవీందర్ రావు, తాతామధు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మెత్కు ఆనంద్,గణేశ్ బిగాల, శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు.గత సంవత్సరం పద్మశ్రీ అవార్డు అందుకున్న గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు తన స్థానిక జిల్లా కేంద్రంలో నివాసయోగ్యమైన ఇంటి స్థలాన్ని, నిర్మాణం ఖర్చులకోసం 1 కోటి రూపాయలను సిఎం కేసిఆర్ ప్రకటించారు.
ఇందుకు సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కును సిఎం కేసిఆర్ ఆదేశించారు
.