టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసే విషయంపైనే దృష్టిపెట్టారు.ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ పుంజుకున్నట్టు గా కనిపిస్తుండటం , అలాగే వైసీపీ రోజురోజుకు ప్రజాదారణ కోల్పోవడంతో బలపడేందుకు ఇదే సరైన సమయంగా చంద్రబాబు భావిస్తున్నారు.
అయితే మరింత బలపడాలంటే పార్టీలో అంతర్గతంగా తీసుకున్న నిర్ణయాలు బయటకు పొకుండా చూసుకునే విషయంపైనే ఇప్పుడు సీరియస్ గా దృష్టి పెట్టారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ తమ ప్రధాన ప్రత్యర్థి వైసీపీకి ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేర వేస్తున్న నాయకులపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు.
ఎవరెవరు కోవర్ట్ రాజకీయాలకు పాల్పడుతున్నారనే విషయాన్ని ప్రాథమికంగా బాబు గుర్తించారు.వారందరి పైన ఆలస్యం చేయకుండా వేటు వేయాలని అప్పుడే తెలుగుదేశం పార్టీకి మంచి రోజులు వస్తాయని బాబు బలంగా నమ్ముతున్నారు.
ముఖ్యంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి చెందడం, అలాగే కుప్పం నియోజకవర్గంలో అంతే స్థాయిలో ఓటమిని ఎదుర్కోవడాన్ని బాబు చాలా సీరియస్ గానే తీసుకున్నారు.కుప్పం నుంచే పార్టీ ప్రక్షాళన మొదలుపెడతాము అంటూ బాబు ప్రకటించినా, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో టీడీపీ అభ్యర్థులు మొత్తం ఓటమి చెందడానికి కారణం కోవర్ట్ రాజకీయాలే అని గుర్తించి ఇప్పటికే ఇద్దరి పైన సస్పెన్షన్ వేటు వేశారు.
వారిద్దరూ అధికార పార్టీకి పూర్తిగా సహకరించారనే సమాచారంతోనే బాబు వేటు వేశారు.ఈ ప్రక్షాళన ఇక్కడితో ఆగదు అని, ప్రతి జిల్లా ,ప్రతి నియోజకవర్గంలోనూ కోవర్ట్ నాయకులను గుర్తించి వారిని తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేసి తీరుతామని బాబు శపథం చేస్తున్నారు.
కోవర్ట్ నాయకులను పార్టీలో కొనసాగించడం వల్ల పార్టీకి డ్యామేజ్ తప్ప ఉపయోగం ఉండదని అటువంటి వారిపై వేటు వేయాల్సిందే అనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు.ఇప్పటికి కోవర్టు నాయకులు ఎవరనేది బాబు గుర్తించారట.కొంతమంది రాష్ట్రస్థాయి కీలక నాయకులుగా ఉన్న వారు సైతం వైసీపీకి సమాచారం ఇస్తున్నారని , అలాగే పార్టీ ఆఫీసులో టీడీపీ తరఫున మీడియా సమావేశం ఏర్పాటు చేసే వ్యక్తుల్లో న్యూ వైసీపీ కోవర్టులు ఉన్నారనే విషయంపై పక్కా సమాచారం అందిందట.ఈ పరిణామాలపై టీడీపీ లో ఉంటూ వైసీపీకి సహకరిస్తున్న నాయకుల్లో ఆందోళన పెరుగుతోంది.
ప్రస్తుతం వైసీపీ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవడం తో పాటు , అన్ని వ్యవహారాలలోనూ విఫలమైందని వాదన తెరపైకి వచ్చిన సమయంలో , ఆ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశమే లేదని ప్రచారం జరుగుతోందని, ఇప్పుడు ఉన్న పార్టీలో స్థానం కోల్పోతే తమ పరిస్థితి రెండింటికీ చెడ్డ రేవడిలా మారుతుంది అనే టెన్షన్ నెలకొందట.