ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాధారణంగా ఇతర పార్టీల నాయకుల చూపు అధికార పార్టీపై ఉంటుంది.ప్రభుత్వం వచ్చిన వెంటనే చేరిపోతే కీలకమైన పదవుల తో పాటు, అన్ని పనులను చక్కబెట్టుకోవచ్చు అనే ఆశతో చాలామంది నాయకులు అధికార పార్టీ లోకి క్యూ కట్టేస్తూ ఉంటారు .
ఇక ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలు చాలామంది అధికార పార్టీ వైపు చూస్తూ ఉంటారు. తమకు సరైన ప్రాధాన్యం ఇస్తే తాము వచ్చి చేరుతాము అనే సంకేతాలు పంపిస్తూ ఉంటారు.ఆ విధంగానే టీడీపీ ప్రభుత్వంలో వైసీపీ కి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపి లో చేరడం, వారిలో చాలామందికి కీలకమైన మంత్రి పదవులు దక్కడం వంటి వ్యవహారాలు చోటు చేసుకున్నాయి.2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నేరుగా వైసీపీలో చేరకపోయినా ఆ పార్టీకి మద్దతుగా టీడీపీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలతో పాటు, జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జగన్ కు జై కొట్టారు.
అన్ని విషయాల్లోనూ జగన్ నిర్ణయాలు సమర్థిస్తూ బహిరంగంగానే వైసిపి నాయకుల్లానే వ్యవహరిస్తున్నారు.జగన్ దగ్గర రాపాక వరప్రసాద్ మంచి ప్రాధాన్యమే సంపాదించుకున్నారు.అయితే రాబోయే ఎన్నికల్లో రాపాక కు జగన్ టికెట్ ఇస్తారా లేక పక్కన పెడతారా అనేది సందిగ్ధంగా మారింది.ఎందుకంటే నియోజకవర్గంలో రాపాక తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొన్నారు.
అభివృద్ధి పనుల విషయంలో నియోజకవర్గానికి ఏమి చేయలేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. పైగా జనసేన కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో బలంగా ఉన్నారు.
జనసేన నుంచి గెలిచి తర్వాత జగన్ కు రాపాక జై కొట్టడంతో ఆయన ఈ విషయంలో అవకాశం దొరికితే దెబ్బకొట్టేందుకు కాచుకుని కూర్చున్నారు జనసైనికులు.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి కనుక పోటీ చేస్తే చిత్తుగా ఓడించాలనే పట్టుదలతో ఉన్నారు.
ఈ వ్యవహారాలన్నీ జగన్ వరకు వెళ్లాయి.దీనికితోడు రాజోలు నియోజకవర్గంలో మూడు గ్రూపులుగా వైసిపి ఉండడం, ఈ గ్రూపుల మధ్య నిత్యం తగాదాలు ఏర్పడుతూ ఉండటం వంటి వ్యవహారాలతో రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా గెలుపు కష్టమవుతుందని అభిప్రాయంలో జగన్ ఉన్నారట.2009లో కాంగ్రెస్ నుంచి రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక వరప్రసాద్ గెలిచారు. 2014లో ఆయనకు టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసినా, చిత్తుగా ఆయన ఓటమి చెందారు.
ఇప్పుడు వైసీపీ నాయకులలోను , నియోజకవర్గం ప్రజలలోనూ ఇకపై సదాభిప్రాయం లేకపోవడంతో జగన్ సైతం ఆయనను ఎన్నికలనాటికి పక్కనపెట్టేస్తారనే ప్రచారం ఇప్పుడు రాజోలు నియోజకవర్గం లో మొదలైంది.