హుజురాబాద్ ఉప ఎన్నికల పోరులో బీజేపీ టీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ వాతావరణం నెలకొంది.బిజెపికి ఇక్కడ అవకాశం దొరక్కుండా చేసేందుకు అధికార పార్టీ టిఆర్ఎస్ ఎన్నో రకాల సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాకుండా, మంత్రులు ఎమ్మెల్యేలు కీలక నాయకులను ఈ నియోజకవర్గంలో మోహరించి తమదే పైచేయి గా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, బిజెపి సైతం అంతే స్థాయిలో తమ బలం నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఇక్కడి నుంచి బిజెపి తరఫున పోటీ చేయబోతున్న ఈటెల రాజేందర్ స్థానికంగా బలమైన నాయకుడు కావడంతో, ఈ ఎన్నికల్లో విజయంపై బిజెపి ధీమాగానే ఉంది.ఇక హుజూరాబాద్ నియోజకవర్గం లో కాంగ్రెస్ ప్రభావం అంతంత మాత్రంగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
ఈ నియోజకవర్గంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు పెద్దగా దృష్టి సారించకపోవడం తో, ఇక్కడ కాంగ్రెస్ ప్రభావం నామమాత్రంగానే ఉండబోతోందని అందరికీ అర్థమైంది.
అయితే ఈ నియోజకవర్గంలో గట్టిపట్టు ఉన్న మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ పోటీ చేస్తారని మొదటగా ప్రచారం జరిగినా, ఆయన ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేశారు.
దీంతో వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేత మాజీ మంత్రి కొండా సురేఖ ఇక్కడి నుంచి పోటీ చేస్తారనే పెద్ద హడావుడి నడిచింది.కానీ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆమె అంగీకారం తెలిపారు.
అయితే తాను ఇక్కడి నుంచి పోటీ చేయాలి అంటే, తమ కుటుంబానికి వరంగల్ తూర్పు, పరకాల, భూపాలపల్లి టికెట్లు కేటాయించాలని సురేఖ కండిషన్ విధించారు.
భూపాలపల్లిలో గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సిద్ధమవడం తో ఆయనకు ఆ నియోజకవర్గం టిక్కెట్ ఇవ్వాల్సి ఉంది.దీంతో వరంగల్ పరకాల స్థానాల్లో మాత్రమే తాము పోటీ చేస్తానంటూ హుజురాబాద్ పై సురేఖ ఆసక్తి చూపించలేదు.ఇదే కాకుండా కొండా సురేఖ వంటి బలమైన నాయకురాలిని కొత్తగా హుజూరాబాద్ నియోజకవర్గం లోకి తీసుకు వచ్చినా, ఆమె బలం తగ్గించినట్లు అవుతుందని బిజెపి టిఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ ఎలాగూ ఉంటుంది కాబట్టి, సురేఖ ఇక్కడ పోటీకి దింపే కంటే మరో నేతను ఇక్కడి నుంచి పోటీకి దింపి, రాబోయే ఎన్నికల్లోనూ ఆ అభ్యర్థిని బలమైన నాయకుడిగా తీర్చిదిద్దాలని రేవంత్ అభిప్రాయపడడం తోనే కొండా సురేఖ పేరును ఫైనల్ జాబితా నుంచి తప్పించినట్లు సమాచారం.